calender_icon.png 27 October, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు వ్యాఖ్యలతో కనువిప్పు కలిగేనా?

27-10-2025 01:13:49 AM

  1. పట్టణాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు 

వీటిపై వసూళ్ల విప్లవం అధికారులు, న్యాయవాదులు ఆలోచించాలని సూచించిన న్యాయస్థానం 

మేడ్చల్, అక్టోబర్ 26(విజయ క్రాంతి): పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు, అనధికారుల అండదండల వల్ల అక్రమ నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోవడానికి జాప్యం చేయడంతో ఈలోగా నిర్మాణం పూర్తవుతుంది.

చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తూ అక్రమ నిర్మాణాదారులకు ఒక రకంగా సహకరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు అక్రమ నిర్మాణాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ అధికారులకు, న్యాయవాదులకు చురకలు అంటించడమే గాక, అక్రమ నిర్మాణదారులకు హెచ్చరికలు జారీ చేసినట్లయింది.

అక్రమ నిర్మాణాల వసూళ్ల విప్లవం సాగుతోందని, ఇవి సమస్యలు తెచ్చి పెడు తున్నాయని, భవిష్యత్తు తరాలు క్షమించబోవని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టారాజ్యాంగ చేపడుతున్న అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని, ఈ కేసులు వాదించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని‘ న్యాయవాదులకు సూచించింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పర్వతాపూర్ లో 175 గజాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని సంజీవ్ కుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారిస్తున్న సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేగాక అక్రమ నిర్మాణాలపై జస్టిస్ బి విజయసేన రెడ్డి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల వల్ల పార్కింగ్ సమస్యలు, ఇరుగుపొరుగు వారి మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తుతాయని తెలిపింది. జి ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి తీసుకొని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని నిర్మాణదారుడుని ప్రశ్నించింది. 

కాసులు కురిపిస్తున్న అక్రమ నిర్మాణాలు 

మేడ్చల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు, నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో అక్రమ నిర్మాణాలు అధికారులకు, అనధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. జి ప్లస్ 2 అనుమతి తీసుకొని అదనంగా మరిన్ని అంతస్తులు నిర్మించినా, సెట్ బ్యాక్ లేకుండా నిర్మించినా, రోడ్డు ఆక్రమించినా మున్సిపల్ అధికారులు వెంటనే కూల్చివేయాలి. కానీ పట్టించుకోవడం లేదు. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు.

కానీ చర్యలు తీసుకోకుండా అమ్యమ్యాలు మాట్లాడుకుని వస్తున్నారు. ఇతర అనధికారుల సైతం పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల రెం డు అంతస్తులకు మాత్రమే అనుమతులు ఉంటున్నాయి. ఆపై మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. వాణిజ్య భవనాల సైతం అక్రమంగా నిర్మిస్తున్నారు. వీటిలో ఏమైనా ప్రమాదా లు జరిగితే బాధ్యత వహిస్తారో అధికారులకే తెలియాలి.

ప్రభుత్వానిదీ  నిర్లక్ష్యమే

అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. పురపాలక సంఘాలలో ముఖ్యమైన పట్టణ ప్రణాళిక విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో టిపిఎస్ ఉండాల్సి ఉండగా, మూడు మున్సిపాలిటీలకు ఒక అధికారిని నియమిస్తోంది. వీరు ఏ మున్సిపాలిటీకి న్యాయం చేయలేకపోతున్నారు.

మూడు మున్సిపాలిటీలలో టీపీఎస్ లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఎల్లంపేట మున్సిపాలిటీలో టీపీఎస్ రాధాకృష్ణారెడ్డి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈయనకు భూదాన్ పోచంపల్లి, ఎల్లంపేట, మేడ్చల్ మున్సిపాలిటీలు ఉన్నాయి.

మేడ్చల్ లో ఒక కాలనీలో అన్ని అక్రమ నిర్మాణాలే

మేడ్చల్ పట్టణంలోని కెఎల్‌ఆర్ కాలనీలో పెద్ద మొత్తంలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్క భవనాన్ని కూడా అనుమతుల మేరకు నిర్మించడం లేదు. ఇక్కడ నిర్మిస్తున్న భవనాలన్నీ అక్రమ నిర్మాణాలే. కమర్షియల్  బిల్డింగులు సైతం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. జి ప్లస్ 2 అనుమతులు తీసుకొని అదనంగా అంతస్తులు నిర్మిస్తున్నారు.

ఏసీబీకి పట్టుబడిన టిపిఎస్ రాధాకృ ష్ణారెడ్డి అండదండలతో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను  అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.