calender_icon.png 27 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీపీ, జడ్పీటీసీ పదవుల్లో ఎస్సీలకు తీరని అన్యాయం

27-10-2025 12:00:00 AM

-మండల ఏర్పాటు నుండి ఇప్పటివరకు దక్కని అవకాశం

-రాష్ట్ర స్థాయి నాయకులు   ఉన్నప్పటికీ పదవులకు దూరం

సంస్థాన్ నారాయణపూర్,అక్టోబర్ 26(విజయక్రాంతి):సంస్థాన్ నారాయణపురం మండలంలో జెడ్పీటీసీ,ఎంపీపీ పీఠం ఎస్సీ సామాజిక వర్గానికి అందని ద్రాక్షగానే మారింది. మండలం ఏర్పడి దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎంపీపీ,జడ్పీటీసీ పదవులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహించ లేదు.

రాజకీయ నాయకుల అండదండతో రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఎన్నో ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంచుతున్నారని ఎస్సీ నాయకులు వాపోతున్నారు.జనాభాలో మండల వ్యాప్తంగా అధిక శాతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నప్పటికీ అధికారానికి వచ్చేసరికి ఆమడ దూరంలోనే ఉండాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 1987 నుండి 2025 వరకు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన వారిని పరిశీలిస్తే 1987- 1992 లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన  దేప జనార్ధన్ రెడ్డి మండల  పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

1995- 2000 వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన కాటం రాములు యాదవ్,2001-2006 వరకు ఓసి సామాజిక వర్గానికి చెందిన మంచికంటి జనార్ధన్,2006-2011 వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన సూరేపల్లి రఘుపతి,2011 లో అదే సామాజికవర్గం నుండి ఎల్లంకి శ్రీనివాస్ గౌడ్ మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.అనంతరం 2014-2019 వరకు ఎస్టీ వర్గానికి చెందిన వంకుడోతు బుజ్జి అధ్యక్షురాలిగా ఎన్నికవ్వగా అనంతరం 2024 వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గుత్తా ఉమాదేవి ప్రేమ్ చందర్ రెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టారు.

ఇక జడ్పీటీసీ రిజర్వేషన్లకు వస్తే

1995 లో జనరల్ స్థానానికి సీపీఐ నుండి గులాం రసూల్ ఎన్నికయ్యారు.2001 లో రిజర్వేషన్  బీసీ జనరల్ ఖరారవ్వగా సీపీఐ నుండి గులాం రసూల్ మళ్ళీ పదవి చేపట్టారు. 2006 లో ఎస్టీ మహిళ   రిజర్వేషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి వాంకుడోత్ బుజ్జి జడ్పీటీసీ పదవి చేపట్టారు.

2014 లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో అప్పటి తెరాస నుండి బొల్ల శివశంకర్ ,2019 లో బీసీ మహిళ వీరమల్ల భానుమతి తెరాస నుండి ప్రాతినిధ్యం వహించారు.       గత 35 సంవత్సరాలుగా ఎన్నో కారణాలతో , నాయకుల రాజకీయానికి బలైపోయిన ఎస్సీ సామాజిక వర్గానికి ఈసారైనా మండల పరిషత్,జడ్పీటీసీ పదవులలో అవకాశం కోసం వేచి చూస్తున్నారు. 

ఎస్సీ వర్గానికి తీవ్ర అన్యాయం

‘అధికార పార్టీ రాజకీయ నాయకు ల అండదండలతో అధికారులు తమ విధులను సక్రమం గా నిర్వర్తించక రిజర్వేషన్లను మార్చి ఎస్సీ వర్గానికి తీవ్ర అన్యాయం చేశారు. మండలంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నప్పటికీ పదవులు వచ్చేసరికి మొం డి చేయి మిగులుతుంది.ఈ సారైనా  ఎంపీపీ జడ్పీటీసీ పదవులు ఎస్సీలకు రిజర్వేషన్ కేటాయించాలి.‘

  ఎర్రోళ్ల వెంకటయ్య, బీఎస్పీ సీనియర్ నాయకులు