calender_icon.png 27 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీతాలియ్యట్లే..

27-10-2025 12:00:00 AM

మిషన్ భగీరథలో శ్రమ దోపిడీ..

ఏండ్ల తరబడి అరకొర వేతనాలే..

వీకాఫ్లు అమలు చేయట్లే..

ప్రభుత్వమూ పట్టించుకోట్లే..

శ్రమదోపిడీ చేస్తోన్న కాంట్రాక్టు సంస్థలు

నల్లగొండ, అక్టోబర్ 26(విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ భగీరథ’ పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏండ్లు గడుస్తున్నా.. పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ చేరింది లేదు. కానీ పథకం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థలు మాత్రం తమ జేబులు నింపుకుంటూ.. కార్మికుల పొట్ట కొడుతున్నాయి.

దాదాపు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్లో పెట్టడమే కాదండోయ్.. కనీసం ఈఎస్‌ఐ, పీఎఫ్ను అమలు చేయడం లేదు. కొంతమంది అక్రమార్కులు.. ఒక్కో ఉద్యోగి నియామకం కోసం రూ.లక్ష వరకు వసూలు చేసిన దాఖాలాలు లేకపోలేదు. అయినా నేటికీ ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకపోనూ నాలుగు నెలులుగా వేతనాలు చెల్లించకపోవడం మిషన్ భగీరథ సిబ్బంది భగ్గుమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు దశల్లో మిషన్ భగీరథ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లా పరిధిలో 3333 గ్రామాల్లోని ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సిబ్బంది నియమించుకుంది. అయితే వీరికి న్యాయంగా అందాల్సిన వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్, సీఎల్, వీకాఫ్ తదితర సౌకర్యాలేవీ అమలు కావడం లేదు.

ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తంగా 1650 మంది సిబ్బంది మిషన్ భగీరథ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. దాదాపు 16వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని 4 ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. ఇందులో అటెండర్ దగ్గరి నుంచి ప్లాంట్ సూపర్వైజర్ల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. పానగల్, చందనపల్లి, అవంతిపురం, ఇమాంపేట, మోతే, గోపాలయపల్లి, లింగోటం, కోదండపురం ప్రాంతాల్లో మిషన్ భగీరథ పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి.

పంప్ ఆపరేటర్ల అరిగోస..

మిషన్ భగీరథ నీటి సరఫరాలో పంప్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తారనే చెప్పాలి. అయితే పంప్ ఆపరేటర్ల నిర్వహణ బాధ్యతను జీవీపీఆర్ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. అయితే ఈ పంప్ ఆపరేటర్లకు గత నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదు. దీనికితోడు జీవీపీఆర్, రాఘవ కంపెనీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయకపోవడం కొసమెరుపు. దీంతో పంప్ ఆపరేటర్ల బాధ వర్ణనాతీతంగా మారింది. చివరకు సిబ్బందికి గుర్తింపు కార్డులు, వీక్లీ ఆఫ్లు, సీఎల్లను అమలు చేయడం లేదు.

పెండింగ్లో వేతనాలు.. ఈఎస్‌ఐ, పీఎఫ్..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో ఆయా కాంట్రాక్టు సంస్థల పరిధిలో దాదాపు 1650 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత మిషన్ భగీరథ పథకంలో గత 7సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆయా కంపెనీలు కార్మికులు ఒప్పందంలో ఉన్న వేతనాలను సైతం చెల్లించడం లేదు.

దీనికితోడు పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యా, వైద్యం, పెట్రోల్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కార్మిక కుటుంబాలపై పెనుభారం మోపినట్టు అవుతోంది. దీంతో సదరు కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు అధికారులు స్పందించి మిషన్ భగీరథ కార్మికులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.