29-12-2025 01:54:20 AM
ఫిజిక్స్, జీవశాస్త్రం, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కరువు
నాగల్ గిద్ద, డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నాగలిగిద్ద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని పలువురు విద్యార్థులు తెలిపారు.
కరస్ గుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు లేకపోవడంతో జి ల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు నాగలిగిద్ద మండలంలోని ముగ్గురు ఉపాధ్యాయులకు వారానికి మూడు రోజుల చొప్పున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరస్ గుత్తిలో బోధన చేయాలని ఆర్డర్ కాపీ జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు హాజరు కాలేదని విద్యార్థులు వాపోతున్నారు.
పాఠా లు పూర్తిగాకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా కరస్ గుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రం సిలబస్ పూర్తికాకపోవడంతో అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు ఉపాధ్యాయులను నియమించి సిలబస్ పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.. మన్మథకిషోర్, ఎంఈవో, నాగలిగిద్ద
కరస్ గుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాం. వారానికి మూడు రోజులు చొప్పున పాఠాలు చెప్పాలని ఆదేశించాం. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాని విషయం నా దృష్టికి వచ్చింది. పై అధికారులకు తెలిపి ఉపాధ్యాయులను నియమించి సిలబస్ పూర్తి చేసి విద్యార్థులకు న్యాయం చేస్తాం.