23-07-2024 03:50:00 AM
హనుమకొండ, జూలై 22 (విజయక్రాంతి): కవితాగ్ని ధారలు కురిపించిన సాహితీయోధుడు దాశరథి కృష్ణమాచార్యులని ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో దాశరథి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన దేశపతి.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దాశరథి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ.. దాశరథి కలం నిండా పోరాట పటిమను నింపుకున్నారని అన్నారు. ఆ మహనీయుడి పేరు వినగానే చల్లని సముద్రగర్భం అనే పాట గుర్తుకొస్తుందంటూ పాటను పాడి వినిపించారు. చిన్నగూడూరు మండలానికి దాశరథి గూడూరు పేరుతోపాటు గ్రామంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేయడానికి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్, కవి పీదారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.