09-12-2025 02:36:05 AM
హైదరాబాద్/ఆదిలాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా చలికి వణికిపోతోంది. రాష్ర్టంలోనే రికార్డు స్థాయిలో అర్లి (టి)లో సోమవారం 6.8 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో గతేడాది ఇదే రోజు కంటే అత్యల్పంగా సోమవారం 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి.
వికారా బాద్ జిల్లాలో బంత్‌వారం (నాగారం)లో 7.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 7.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో 8.2 డిగ్రీలు, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో 8.2 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేట్, నిజామాబాద్ జిల్లా కోట్‌గిరి, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 8.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజులు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావారణ శాఖ తెలిపింది.
సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీస్తాయని హెచ్చరించింది.