11-05-2024 12:26:19 AM
ఎన్నికలు ఇండియాలో జరుగుతున్నాయి
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలున్నాయి
దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటోంది
అమేథీ ఎన్నికల సభలో ప్రియాంక గాంధీ విమర్శలు
రాయ్‌బరేలీ, మే 10: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే.. పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చ పెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన గతంలో చెప్పిన మాటలను పట్టుకుని ఇప్పుడు ఎందుకు చర్చ లేవనెత్తుతున్నారని దేశం లో నిరుద్యోగం ఏకంగా 45 ఏళ్ల గరిష్టానికి పెరిగిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ నిజమైన సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతోందని, కానీ ప్రజలు మతాలు, కులాల ఆధారంగా ఎన్నికల జరగడం ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. గత రెండు ఎనన్నికల్లో మతం పేరుతో బీజేపీ గెలిచిందని ప్రజలు చెప్పుకొంటున్నారని, ఇప్పుడైనా కాస్త మారాలని బీజేపీకి సూచించారు.
పాత వీడియోలపై రాద్ధాంత ఏంటి?
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ఆయన ఎప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారు. అవి పాత వ్యాఖ్యలైతే.. ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నారు? ఇంకో విషయం.. ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? భారత్‌లోనా..? పాకిస్థాన్‌లోనా? ఎన్నికలు భారత్‌లో జరగుతున్నాయి. మరి ఎందుకు పాకిస్థాన్ గురించి చర్చలు లేవనెత్తుతున్నారు?’ అని అమేథీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ‘ప్రజలు మార్కెట్‌కు వెళ్లి కొనాలనుకున్న సరుకులు సగం కూడా కొనకుండానే తిరిగి ఇంటికి వెళ్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రజలు వైద్యం చేయించుకోవాలంటే తీవ్ర ఆందోళన చెందుతున్నాని, దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆదాయం ఉండట్లేదని, డీజిల్ నుంచి వ్యవసాయ పనిముట్ల వరకు ప్రతీది చాలా ఖరీదు అయ్యాయని మండిపడ్డారు. కూలీలను దోచుకుంటున్నారని, వారికి పనికి తగ్గ వేతనం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజల రక్షణ, భద్రతను దేవుడికి వదిలేసిందని, కానీ తాము మాత్రం వారు సురక్షితంగా ఉండాలని తీవ్రంగా కృషి చేశామని చెప్పారు. ప్రజలకు, కాంగ్రెస్‌కు మధ్య బంధం రాజకీయ సంబంధం కాదని, తాము ఎంపీలుగా గెలిచినా గెలవకున్నా.. ఆ బంధం అలాగే ఉంటుందని పేర్కొన్నారు.