13-01-2026 02:12:33 AM
మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థులు కొన్నిచోట్ల ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి వసూలు చేసుకుంటుండగా, ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీచేసి ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థి చింతకుంట్ల పారిజాతం ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఓటమిపాలైనప్పటికీ సర్పంచ్ అభ్యర్థి పారిజాతం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం హర్షనీయమన్నారు. ఓడిపోయిన సర్పంచులు కొంతమంది పలుచోట్ల ఓటర్లకు పంచిన డబ్బులు, ఇతర వస్తువులను బలవంతంగా తిరిగి తీసుకుంటున్న నేపథ్యంలో పారిజాతం అలాకాకుండా సర్పంచిగా గెలిపించకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నిలబెట్టుకు నేందుకు సొంత డబ్బులు ఇచ్చి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు.