04-01-2026 12:00:00 AM
రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతు న్న సంగతి తెలిసిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ప్రస్తుతం ‘తలైవర్173’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతలు చేపట్టేది ఎవరనే విషయమై చాలా రోజులుగా సినీప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజాగా మేకర్స్ ఆ ఉత్కంఠకు తెర దించుతూ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించింది. 2027 సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.