calender_icon.png 25 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణుగూరులో బూడిద వాన

24-07-2025 12:20:13 AM

- ఆశ్చర్యపోయిన ప్రజలు

మణుగూరు, జూలై 23: వర్షాకాలం వానలు, వడగళ్లు పడటం సహజం. కానీ వీటికి భిన్నంగా భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో బుధవారం వింతగా బూడిద వాన కురిసింది. చూసిన ప్రజలు ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడు చూడలే అంటూ ఆశ్చర్యపోయారు. బుధవారం ఉదయం మొదలైన వాన.. అచ్చం చిప్స్‌తో మిక్స్ చేసిన బురద నీరుగా కురిసింది. ఈ వింతను తిలకించేందుకు వానలో బయటకు వెళ్లిన వారి బట్టలు సైతం మురికిగా మారిపోయాయి. ఇళ్ల  పరిసరాల్లో బూడిదరంగులో నీళ్లు ప్రవహించాయి. 

విచిత్ర వానకు కారణం ఏమిటి?

మణుగూరు మండలంలో ఓపెన్ కాస్ట్ , బొగ్గు శుద్ధి కేంద్రాలు, బొగ్గు రవాణా లారీల నుంచి వెలువడే బూడిద, మరో వైపు భద్రాద్రి పవర్ ప్లాంట్, యాష్ పాండ్,  డంపింగ్, కాలుష్యం, వాతావరణ నిబంధనల పాటించకపోవడం వల్ల గాలిలో కలసిన బూడిద రేణువులు వర్షపు జలంతో కలసి బూడిద వర్షం కురిసిందని పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. ఈ వింత వర్షం కురవడానికి వాతావరణ మార్పు ప్రభావమా? లేదా మానవ తప్పిదాల ఫలితమో సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే పరిశీలన చేయాలని, ప్రజారోగ్యం దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.