07-05-2025 12:00:00 AM
డిప్యూటీ డీఎంహెచ్ ఓ సుధీర్ రెడ్డి
మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): తల్లి లాంటి బాధ్యత ఆశా కార్యకర్తలదని డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆశా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు. గర్భిణులు , బాలింతలు, శిశువులకు నిర్ణీత సమయానికి టీకాలు ఇతర వైద్యం అందేలా చూడాలన్నారు.
మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలవారి మాత్రలు విధిగా అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వచ్చే అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించేందుకు ఆశా కార్యకర్తలు చొరవ చూపాలన్నారు.
గ్రామాల్లో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేసేలా పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, మండల వైద్యాధికారి డాక్టర్ జ్వలిత, డాక్టర్ మీరాజ్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మానస, డాక్టర్ నందన, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు