21-07-2025 01:17:16 AM
- మంత్రి సీతక్కతో మర్యాదపూర్వక భేటీ
- ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ విభాగం నూతన ఇన్‌ఛార్జ్ ఈఎన్సీగా ఎన్. అశోక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ రహదారులు, భవనా లు, మౌలిక వసతుల కల్పనలో ప్రజా ప్ర భుత్వ ఆశయాలకు అనుగుణంగా పనులు వేగంగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ ఈఎన్సీ అశోక్‌కు ఈ సందర్భంగా మంత్రి సీతక్క సూచించారు.
ఇంజినీరింగ్ అధికారిగా అశో క్ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అశోక్ ఇంటర్మీడియట్ వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యనభ్యసించారు. అనంతరం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ సూరత్కల్‌లో ఎంటెక్ అభ్యసించారు. ఎంటెక్ చివరి ఏడాదిలో ఉన్న సమయంలో 1989లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షలో అర్హత సాధిం చి పంచాయతీరాజ్ విభాగంలో ఏఈఈగా చేరారు.
1989లో గజ్వేల్‌లో ఏఈఈగా తన మొదటి పోస్టింగ్ పొందారు. అక్కడ ఐదేళ్లు సేవలందించారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలో ఒక సంవత్సరం పనిచేసి డీఈగా ప్రమోషన్ పొందారు. బాన్సువాడ ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంలో డీఈగా ఆరేళ్లపాటు సేవలందించారు. తర్వాత ప్రమోషన్ పొంది దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో ఈఈగా నాలుగేళ్లు పనిచేశారు. హైదరాబాద్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఈఈగా ఆరేళ్లు సేవలందించారు. తర్వాత ఎస్‌ఈగా హైదరాబాద్ హెడ్ ఆఫీసులో రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం సీఈగా పదోన్నతి పొందిన ఆయన, గత ఒకటిన్నర సంవత్సరాలుగా హెడ్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇన్‌ఛార్జ్ ఈఎన్సీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.