calender_icon.png 30 August, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి

30-08-2025 12:00:00 AM

 కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి):  మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నెల 30వ తేదీ వరకు తెలియజేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 2 వ తేదీన వార్డు, గ్రామ పంచాయతీల వారీగా ఫోటోతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా  జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను ఈ నెల 28 న ప్రదర్శించడం జరిగిందన్నారు.

ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా, ఈ నెల 30 వరకు అభ్యంతరాలు  స్వీకరించడం జరుగుతుందని, 31న అభ్యంతరాలను పరిష్కరిస్తామని, అనంతరం సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితాను  విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెల 30న( శనివారం ) మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ సమావేశంలో పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా పై అభ్యంతరాలు తెలపవచ్చని కలెక్టర్ సూచించారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.