calender_icon.png 29 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీఎం కేంద్రాల్లో చోరీ ముఠా అరెస్ట్

29-12-2025 01:56:54 AM

నగదు రాకుండా ఏటీఎం స్లాట్లలో ప్లేట్లు..

ఖాతాదారులు వెళ్లిన తర్వాత డబ్బులు దొంగిలిస్తున్న రాజస్థాన్ ముఠా

ఏడుగురిని అదుపులోకి తీసుకున్న  కాజీపేట పోలీసులు

కాజీపేట (మహబూబాబాద్), డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఏటీఎం స్లాట్లలో ప్లేట్లు పెట్టి, నగదు బయటకు రాకుండా అడ్డుకొని ఖాతాదారులు వెళ్లిన తర్వాత దొంగిలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను కాజీపేట, సీసీఎస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వరంగల్ నగరంలో కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గత పది రోజుల నుంచి 6 ఏటీఎం కేంద్రాల్లో 23 సార్లు ఖాతాదారుల డబ్బు రూ.12 లక్షల పదివేలు చోరీ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ముఠా సభ్యులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు.

సులభంగా డబ్బు సంపాదన, జల్సాలకు ఖర్చు చేయడం అలవాటు చేసుకున్న వీరు పరిచయస్థుడి ద్వారా ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి లోపాలను ఆధ్యయనం చేశారు. సులభంగా డబ్బులు కాజేసేందుకు పెట్రో కంపెనీకి చెందిన ఏటీఎంలను ఎంచుకున్నారు. ముందుగా కార్లలో వచ్చి మారుతాళం చేతులతో ఏటీఎం డోర్ ఓపెన్ చేసి దానికి స్టిక్కర్ అతికించి ఐరన్ ప్లేట్ బిగిస్తారు. దీంతో ఖాతాదారులు డబ్బులు డ్రా చేస్తే ఏటీఎం నుంచి బయటకు రాకుండా అక్కడే ఆగిపోతాయి. ఖాతాదారులు సాంకేతిక లోపం తలెత్తి డబ్బులు రాలేదని భావించి వెళ్లిపోయిన తర్వాత ఏటీఎంలో నిలిచిపోయిన డబ్బులను వీరు దొంగిలించేవారు.

ఈ క్రమంలో వరంగల్ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగి, ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు కాజీపేట చౌరస్తా ప్రాంతంలోని పెట్రో కంపెనీకి చెందిన ఏటీఎం కేంద్రాల్లో చోరీ చేసేందుకు కార్లలో వచ్చి ఏటీఎం డోర్ ఓపెన్ చేసి దానికి స్టిక్కర్ అతికించి ఐరన్ ప్లేట్ బిగిస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఆరిఫ్ ఖాన్, సర్పరాజ్, ఆశ్ మహమ్మద్, షావుస్కాన్, షారుఖ్ ఖాన్, అస్లాం ఖాన్, ఏం షారుఖాన్ లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించే ఐరన్ ప్లేట్లను, డూప్లికేట్ తాళాలను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ కవిత వెల్లడించారు.