03-05-2025 09:54:44 PM
చేర్యాల: మనం ఏ సమాజంలో ఉన్నాం... ఇంకా ఆటవిక సమాజంలోనే కొనసాగుతున్నామా? ఒకవైపు సమాజం సాంకేతికతలో ఏ ఐ వైపు పరిగెడుతుంటే, మరోవైపు సమాజం తలదించుకునే విధంగా మతోన్మాదుల చర్యలు ఉండటం దేనికి సాంకేతం. పట్టపగలు నడి రోడ్డుపై మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి జరుగుతుంటే మనం ఆధునిక సమాజంలోనే ఉన్నామా! అనే సందేహం కలగక మానదు. మతోన్మాద మూకలు ఇటువంటి దారుణాలకు ఒడిగడుతూ, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటనకు ఎవరు బాధ్యులు.
ఈ దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణికి గ్రామపంచాయతీలోని ఏల్ల దాస్ నగర్ చెందిన ఊపిరి అజయ్ కుమార్ బేడ బుడగ జంగాల కులానికి చెందిన వాడు. స్థానికంగా ఉన్న దేవుని విగ్రహాన్ని అవమానించారని నేపంతో మతిస్థిమితం లేని యువకుడిపై ఆర్ఎస్ఎస్ బిజెపికి చెందిన కార్యకర్తలు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగింపు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఈ ఘటనకు స్పందించిన స్థానిక దళిత సంఘాలు స్థానిక సర్కిల్ కార్యాలయం దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
దాడులు సరికాదు : ఎమ్మెల్యే పల్లా
చేర్యాల మండలంలోని వేచరేని గ్రామంలోని ఎల్లా దాస్ నగర్ చెందిన దేవుడి విగ్రహాన్ని అవమానించాడని మతిస్థిమితం లేని దళిత యువకుడైన అజయ్ కుమార్ పై మతోన్మాద శక్తులు దాడి చేయడం సరికాదన్నారు. దేవుని విగ్రహాన్ని అవమానిస్తే వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించాలి తప్ప దాడి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆ యువకుడ్ని తాళ్లతో కట్టివేసి కొట్టడమే కాకుండా, ప్రధాన రహదారిపై ఊరేగిస్తూ, బట్టలు ఊడదీసి దాడి చేయడం దారుణం అన్నారు. దాడికి పాల్పడిన మతోన్మాద శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టాలని సూచించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.