06-05-2025 12:30:05 AM
ఎల్బీనగర్, మే 5: ప్లాటు రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ పై దాడికి పాల్పడిన ఘటన సోమవారం పెద్ద అంబర్ పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మధ్యాహ్నం జరిగింది. దాడి ఘటనపై ఇరువురు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ రవీందర్ తన విధులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం పెద్ద అంబర్ పేట కు చెందిన పిల్లి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంపై మాట్లాడుతున్నాడు. తన ప్లాట్ ను తాను కొనుగోలు చేసిన తర్వాత ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని, వాటిని రద్దు చేయాలని నిలదీశారు. తాను అన్ని పత్రాలను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ వివరిస్తుండగా.. శ్రీనివాస్ యాదవ్ సహనం కోల్పోయి సబ్ రిజిస్ట్రార్ రవీందర్ పై దాడి చేశాడు.
దాడి ఘటనపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇరువురు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ రవీందర్ మాట్లాడుతూ... శ్రీనివాస్ యాదవ్ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంపై తనతో వాదిస్తూ దాడి చేశాడని తెలిపారు. 2012లో శ్రీనివాస్ యాదవ్ ఒక ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించుకోగా... అదే ప్లాట్ జనవరి 2025లో మరో వ్యక్తిపై రిజిస్ట్రేషన్ అయిందన్నారు.
దీనిపై తాను విచారణ చేస్తానని చెప్పినా వినకుండా తన చాంబర్ లోకి వచ్చి శ్రీనివాస్ యాదవ్ దాడి చేశాడని తెలిపారు. 1991లో ఇతరులకు ప్లాట్ విక్రయించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరో సారి ఇతరులకు ప్లాట్ విక్రయించినట్లు వివరించారు. ఏదైనా భూ సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం లేదా కోర్టుకు వెళ్లాలని, లేదా మరో విచారించాలని సబ్ రిజిస్ట్రార్ కు వివరించి, సమస్యను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు.
విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం సరికాదన్నారు. తనపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ పోలీసులను సబ్ రిజిస్ట్రార్ రవీందర్ కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.