calender_icon.png 22 November, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామరాజ్యం పేరుతో రంగరాజన్ పై దాడి

09-02-2025 10:24:25 PM

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

మొయినాబాద్ పీఎస్ లో కేసు నమోదు..

చేవెళ్ల: రామరాజ్యం పేరుతో చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 7న (శుక్రవారం) కొందరు వ్యక్తులు చిలుకూరులోని రంగరాజన్ ఇంటికి వెళ్లి తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని , శాస్త్రం నేర్చే వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ఇది చేయకుండా కోర్టుల్లో కేసులు వేసి ఏమి లాభమని, అవమానకరంగా మాట్లాడుతూ.. దాడి చేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రంగరాజన్ తండ్రి డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ ఆదివారం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. రామరాజ్యం స్థాపనకు ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేస్తున్న కొందరు వ్యక్తులు, తమ ప్రణాళికలను వ్యతిరేకించేవారిని హింసించాలని ప్రయత్నిస్తున్నారు. వారు రాజ్యాంగపరమైన రామరాజ్య భావనను తప్పుగా అనుసరిస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రంగరాజన్ వారితో సహకరించడానికి నిరాకరించడమే దాడికి ప్రేరణ అని తెలిపారు. అంతేకాకుండా సౌందరరాజన్ 2018లో తన భార్య శ్రీమతి వాసుమతి చివరి కోరిక ప్రకారం రాజ్యాంగానికి సరైన వివరణను స్థాపించే ప్రయత్నాలు విజయవంతమయ్యాయని, ఇది సుప్రీంకోర్టులో స్వామి దయానంద సరస్వతి కేసులో అమలవుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో తిరుప్పన్ ఆల్వార్ అమ్మల్ (SC/ST) సమాజం చేసిన సేవను ప్రశంసిస్తూ, వారి సహాయాన్ని గుర్తించడానికి సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్మారక స్టాంప్, విగ్రహం ఏర్పాటుకు కోరికను కూడా తెలిపారు. సంఘటన తర్వాత, పోలీసులను దాడిలో పాల్గొన్న వారిని, వారి సహాయకులను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరారు. చిలుకూర్ బాలాజీ దేవుని కృపతో రంగరాజన్ సురక్షితంగా ఉన్నట్లు, ఆలయ సేవలను కొనసాగిస్తున్నట్లు సౌందరరాజన్ తెలిపారు. దాడి ఘటన గురించి పోలీసులు స్పందించారు. రంగారాజన్ పై దాడి చేసిన వారిలో వీరరాఘవరెడ్డి ని అరెస్ట్ చేసినట్లు... మిగతా వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.