27-09-2025 07:49:27 PM
రోడ్డుపై చెత్త వేయొద్దు అని చెప్పినందుకు దాడి...
దాడికి పాల్పడిన చాయ్ కేఫ్ యజమాని శ్యామ్
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): రోడ్డుపై చెత్త వేయొద్దు అని చెప్పినందుకు పారిశుధ్య కార్మికులపై ఓ టీ షాప్ యజమాని మున్సిపల్ కార్మికులపై దాడి చేశాడు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలోని రోజులాగే మున్సిపల్ కార్మికులు శనివారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై చెత్తను ఊడ్చే పనిలో నిమగ్నమయ్యారు. అక్కడే ఉన్న చాయ్ కేఫ్ దగ్గర చెత్త ఊడ్చుతుండగా చాయ్ కేఫ్ యజమాని శ్యామ్ కు రోడ్డుపై చెత్త వేయొద్దని చెప్పడంతో శ్యామ్, అతని అనుచరులు మున్సిపల్ కార్మికులు దుడ్డు సురేందర్ పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన దుడ్డు బాలమణి, కొమ్ము వెంకటమ్మలపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కొరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడికి పాల్పడిన శ్యామ్, అతని అనుచరులపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులపై దాడి జరిగిందని సమాచారం అందుకున్న సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు బహదూర్ పల్లి రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.