21-07-2025 01:25:25 AM
- తార్నాకలో వాహనాన్ని అడ్డగించిన 50 మంది దుండగులు
- గన్‌మెన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు యత్నం
- ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శ్రీగణేశ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మె ల్యే శ్రీగణేశ్‌పై సుమారు 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి తార్నాక మాణికేశ్వర నగర్‌లో జరిగింది. తార్నాక మాణికేశ్వరనగర్‌లో ఫలహారం బండి ఊరేగింపునకు ఎమ్మె ల్యే హాజరయ్యారు.
ఈ క్రమంలోనే తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి సమీపంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తన వాహనంలో ప్రయాణిస్తుండగా సుమారు 50 మందితో కూడిన ముఠా ఒక్కసారిగా ఆయన వాహనాన్ని చుట్టుముట్టింది. ఎమ్మెల్యే వాహనంపై దాడి చేయడమే కాకుండా, అప్రమత్తమైన ఆయన గన్‌మెన్లను అడ్డుకుని, వారి చేతుల్లోని ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే శ్రీగణేష్ దుండగుల బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు.
అనంతరం ఆయన నేరుగా సమీపంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన దుండగులు ఎవరు? దాడికి గల కారణాలు ఏమిటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది.
ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి మాట్లాడుతూ.. ఐదు బైకులపై 13 మంది వ్యక్తులు వెళ్తూ.. ఎమ్మెల్యే కారుకు దారి ఇవ్వలేదని చెప్పారు. ఎమ్మెల్యే హారన్ కొట్టడంతో బండ్లను రోడ్డుమీద నిలిపి తిరగబడ్డారు. గన్‌మెన్లు కిందకు దిగగానే వాహనాలపై విద్యానగర్ వైపు వెళ్లినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పారిపోయిన వారి పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.