21-07-2025 01:27:26 AM
- ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- బోనాల పండుగ నేపథ్యంలో నగదు పురస్కారం
- నాటు నాటు పాటతో ఆస్కార్ పొందిన రాహుల్
- యువతకు రాహుల్ ఆదర్శనీయమని సీఎం ప్రశంస
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): తన పాటతో ఆస్కార్ అవార్డు పొందిన రాహుల్ సిప్లగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి నజరానా ప్రకటించింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ తెలంగాణ యువతకు రోల్ మోడల్‌గా నిలిచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ఎన్నికల ముందు రాహుల్ సిప్లిగంజ్‌కు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. కోటి ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పాతబస్తీ బోనాల సందర్భంగా తాజాగా రూ. కోటి నజరానా ప్రకటించారు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ యువతకు ఆదర్శనీయమని సీఎం ప్రశంసించారు.
రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడిన ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. మార్చి 2023లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రదర్శించారు. ఆ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలోని ప్రతిభను, భారతీయ సినిమాలోని జీవితకాల విజయాలను గుర్తించేందుకు గద్దర్ ఫిలిం అవార్డులను అందించింది.
అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు. ఆయన గద్దర్ అవార్డుల వేదిక మీదనే హైదరాబాద్ లోకల్ కుర్రాడు అయిన రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా సింగర్ రాహుల్‌కు బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.