calender_icon.png 24 August, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔరంగజేబుకే బురిడీ

24-08-2025 01:09:07 AM

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక దండయాత్రలు చేసి భరతమాతకు గాయాలెన్నో చేశాడు. ఒడిశాలోని పూరీ ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేయలేకపోయాడు. ఆలయాన్ని ధ్వంసం చేయాలని తన వారికి ఆదేశాలిచ్చినా అవి అమలు కాలేదు. 

ఔరంగజేబు ప్రభావం వల్ల కొద్దిరోజుల పాటు రథయాత్ర నిలిచిపోయినా ఆయన మరణం తర్వాత పునఃప్రారంభం అయింది. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గురించి అందరికీ తెలుసు. షాజహాన్ వారసుడిగా సింహాసనం అధిష్టించిన ఔరంగజేబు పలు వివాదాస్పద నిర్ణయాలు,  పనులతో హిందువులు ఎక్కువగా ద్వేషించే రాజుగా, చక్రవర్తిగా మిగిలిపోయాడు. సింహాసనం కోసం అన్న దారా షికోహ్‌ను అతికిరాతంగా చంపిన ఈ ఢిల్లీ సుల్తాన్ జన్మనిచ్చిన తండ్రిని కూడా బందించాడు. షాజహాన్‌ను ఏడేండ్ల పాటు ఆగ్రా కోటలో బందించి అందరి విమర్శలు మూటగట్టుకున్నాడు. అటువంటి ఔరంగజేబుకు సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. అప్పటి వరకు ఢిల్లీని పాలించిన షాజహాన్ నలుగురు సంతానం మధ్య సింహాసనం కోసం భీకర పోరు జరగ్గా.. ఔరంగజేబు అందరినీ ఓడించి సింహాసనం అధిష్టించాడు. చక్రవర్తి షాజహాన్ షికోహ్‌కు మద్దతు తెలిపినా అతడు ఔరంగజేబు ముందు నిలవలేకపోయాడు.

పూరీ క్షేత్ర విశిష్టత.. 

పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదంలా మారిందని భక్తుల విశ్వాసం. క్రీ. శ 1078 సంవత్సరంలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా.. ఆయన మనువడు అనంగభీమదేవ్ నిర్మాణం పూర్తి చేశాడు. అంతకు పూర్వం అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న రాజు కట్టించాడని చెబుతారు. ఈ ఆలయం కూడా చాలా పవిత్రమైందని అందరూ నమ్ముతారు. 

ఔరంగజేబు ఆదేశించినా.. 

ఎంతో విశిష్టత కలిగిన పూరీ ఆలయంపై మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పగబడతాడు. ఆయన స్వయంగా దండయాత్రలను చేయకపోయినా కానీ ఆలయాన్ని కూలగొట్టాలని ఆదేశాలు ఇస్తాడు. క్రీ. శ 1681 నాటికి ఔరంగజేబు చేష్టలు మరీ దారుణంగా తయారయ్యాయి. జగన్నాథ ఆలయాన్ని నాశనం చేయమని ఒక ఫర్మాన్ జారీ చేశాడు. పూరీ ఆలయాన్ని కూల్చివేయాలని బెంగాల్ ప్రావిన్స్‌లో ఉన్న తన సుబేదార్ అమీర్ ఉల్ ఉమారాను ఆదేశించాడు. అలా రాజు ఆదేశాలు జారీ చేయడంతో అమీర్ ఉల్ ఉమారాతో పాటు, ఒడిశా పాలకుడు ఏక్రం ఖాన్, తన సోదరుడు మస్త్రం ఖాన్‌తో కలిసి అక్కడికి వస్తాడు.

అప్పుడు ఖుర్దా రాజు గజపతి ఆలయ రక్షకుడిగా వ్యవహరించాడు. ఔరంగజేబు సైన్యం దండేత్తేందుకు వస్తుందని తెలియడంతో గజపతి భయంతో వణికిపోయాడు. అందరూ నిరాశలో కూరుకుపోయి ఉన్నా ఒక ప్రణాళికను రూపొందించాడు. అప్పుడు మొఘల్ చక్రవర్తి సుబేదార్‌తో చర్చలు జరిగాయి. అతడికి లంచంగా పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపారు. ఔరంగజేబు ఆదేశాలను అమలు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిసినా సుబేదార్ ఏమీ చేయలేకపోయాడు. అంతలా ఒడిశా వ్యక్తులు అతడిని ఒప్పించడంలో సఫలం అయ్యారు. దీంతో అతడు తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. ఔరంగజేబుకు అబద్ధం చెప్పాడు.

ఆలయం కూల్చేశామని వర్తమానం పంపాడు. ఔరంగజేబు అది నిజం అనుకుని నమ్మాడు. జగన్నాథ ఆలయాన్ని కూల్చేశారని, పూజలు ఆగిపోయాయి.. తీర్థయాత్ర ఆగిపోయిందని ఆ గుడిలోని విగ్రహం ధ్వంసం అయిందని ఓ పుకారు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుంది. ఆ సమయంలో వార్షిక యాత్ర నిలిపివేయబడింది. ఈ పరిణామాల వల్ల నిజంగానే పూరీ ఆలయం ధ్వంసం అయిందని ఔరంగజేబు నమ్ముతాడు. అదే సమయంలో దక్షిణాన ఉన్న మరాఠాలు ఔరంగజేబుకు పెద్ద సమస్యను సృష్టిస్తారు.

అందువల్ల తిరుగుబాటును అణిచివేసేందుకు ఔరంగజేబు తొలిసారి దక్కన్ ప్రాంతానికి వస్తాడు. కేవలం మరాఠాలు అని మాత్రమే కాకుండా సిక్కులు, జాట్లు మొదలైన వర్గాల వారు ఔరంగజేబుకు నిత్యం ఇబ్బందులు కలిగిస్తారు.  దాంతో ఔరంగజేబు పూరీ ఆలయం గురించి పూర్తిగా మర్చిపోతాడు. చివరకు ఔరంగజేబు మరణించిన అనంతరం 1707లో పూరీ ఆలయంలో తిరిగి రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ విధంగా ఔరంగజేబు ఎంతలా ప్రయత్నాలు చేసినా కానీ పూరీ ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు.