26-05-2025 07:19:00 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య..
హనుమకొండ (విజయక్రాంతి): రానున్న వర్షాకాలం నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులు రానున్న వర్షాకాలంలో ఆయా శాఖల తరఫున తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ... రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముంపు ప్రాంతాలను అధికారులు ముందస్తుగా గుర్తించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. రోడ్లు తెగిపోయే ప్రాంతాలను ఆ శాఖ అధికారులు ముందస్తుగానే గుర్తించాలన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాలలో వర్షపు నీరు కారణంగా రాకపోకలకు ఇబ్బందికరంగా మారే ప్రాంతాలను గుర్తించాలన్నారు. చెరువులు, వాగుల స్థితిని ఎప్పటికప్పుడు శాఖ అధికారులు గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. వాగులు పారే ప్రాంతాలను అధికారులు గుర్తించాలని, వాటిని సంబంధిత మండలాల తహసీల్దారులు పర్యవేక్షించాలన్నారు.
చెరువుల కట్టలు బలోపేతంగా ఉండేటట్టు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి పునరుద్ధరణ చర్యలు తీసుకునే విధంగా పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు విపత్తు నిర్వహణ సంబంధించిన ఉపకారణాలను సిద్ధంగా ఉంచాలని, బోట్స్, లైఫ్ జాకెట్స్, ది వాటరింగ్ పంపు సిద్ధంగా ఉంచాలన్నారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాలను అధికారులు ముందస్తుగా గుర్తించాలన్నారు. తగిన సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సరిపోను మందులు నిల్వలు ఉంచాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రభలే అవకాశాలున్నచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించేలా సిద్ధంగా ఉండాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ... వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిపి సలీమా, ఇన్చార్జి కలెక్టర్ వైవి గణేష్, మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, డీఏవో రవీందర్ సింగ్, డిపిఓ లక్ష్మి రమాకాంత్, డిఎంహెచ్ఓ అప్పయ్య, ఆర్డిఓ కే నారాయణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.