calender_icon.png 31 August, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామన్నపేట మండల ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలి

30-08-2025 05:06:21 PM

నకిరేకల్,(విజయక్రాంతి): రామన్నపేట మండల వ్యాప్తంగా అపరిస్కృతంగా పేరుకుపోయిన ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి .ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో  ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట తహసిల్దార్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ లాల్ బహదూర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ పాలకుల చిన్న చూపుకు, ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి రామన్నపేట నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. గత కాలం నుండి దీర్ఘకాలికంగా అనేక సమస్యలు పేరుకుపోయినా ఏ ఒక్కటి పరిష్కారం చేయడం లేదని గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పాలకులు పెడ చెవిన పెట్టడం సరికాదని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ప్రధాన రోడ్లు ధ్వంసమై అస్తవ్యస్తంగా మారి ప్రయాణాలు నరక కూపంగా మారుతున్నాయని అన్నారు. ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా మారుస్తామని హామీ తప్ప అమలయింది లేదన్నారు.

జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది తప్ప పరిష్కారం చూపలేదని అన్నారు. మండలంలో ఏ ఒక్క గ్రామానికి బస్సు సౌకర్యం లేదని బస్సులో రాక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. గత ఐదు సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి నూతన పెన్షన్ అందలేదని అనేకమంది పెన్షన్ అందక ఎదురుచూస్తున్నారని, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. ధర్మారెడ్డి పల్లి, పిలాయిపల్లి  కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని వెంటనే వారిని గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంట సంరక్షణ పై అవగాహన కల్పించాలని అన్నారు. రామన్నపేట ను నియోజకవర్గంగా పునర్నిర్మించాలని, డివిజనల్ స్థాయి ప్రభుత్వ ఆఫీసులో తరలిపోకుండా చూడాలని అన్నారు. మండలంలో అనేక గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన దరఖాస్తులు తీసుకోవడం పక్కకు పెట్టడమే అవుతుంది తప్ప పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపడం లేదని, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్న అధికారుల తీరు సరైన కాదని వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రజల్ని సమీకరించి మండల కేంద్రంలో మరో మహా పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.