30-08-2025 05:11:53 PM
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
బత్తాయి తోటలను పరిశీలించిన కమిషన్ బృందం
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో బత్తాయి పంటను కాపాడేందుకు ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో బత్తాయి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్ర వేత్తలతో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సూచనలు, సలహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్తాయి రైతుల సమస్యలను, అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
భవిష్యత్తులో బత్తాయి పంటను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా మార్కెట్లో మధ్య దళారీలు వ్యవస్థ, సౌకర్యాలు లేకపోవడం ,నిర్వహణ లోపం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. బత్తాయి మార్కెట్లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని ,రైతులు మార్కెట్ కు పంటను తీసుకొచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని ,పక్కనే ప్రైవేట్ మార్కెట్ నిర్వహించడం జరుగుతున్నదని, ప్రయివేట్ మార్కెట్ ను ప్రభుత్వ మార్కెట్ తో అనుసంధానం చేయాలని, నల్గొండలో బత్తాయి మార్కెట్ రైతులకు దగ్గరగా ఉండడమే కాకుండా, నమ్మకంగా ఉంటుందని,ఈ మార్కెట్ ను ఇలాగే కొనసాగించాలని అన్నారు.
హైదరాబాదు లాంటి దూర ప్రాంతానికి బత్తాయిని తీసుకువెళ్లడం రవాణా ఖర్చులతో పాటు, రైతులకు ఇబ్బంది కరంగా ఉంటుందని అన్నారు. సాంప్రదాయ పంటగా ఉన్న బత్తాయి పంటను నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో నల్గొండ జిల్లాలో బత్తాయి పంట కనబడకుండా పోతుందని, అందువల్ల రైతులు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్ ను కాపాడవచ్చో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని, బత్తాయి పండించే క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి ఒక నివేదిక సమర్పించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశాల మేరకు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని, బత్తాయి రైతులకు లాభం చేకూర్చే విధంగా శాస్త్రీయమైన పద్ధతిలో ఒక ప్రణాళికను రూపొందిస్తామని, బత్తాయి రైతుల సూచన మేరకు బత్తాయిని పాఠశాలలు, హాస్టల్స్ కు పంపిణీ చేసే విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి ప్రత్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమించాలని జిల్లా కలెక్టర్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. భూవిధాల పరిష్కారంలో భాగంగా సాదా బైనామాల సమస్యలపై స్థానిక సమస్యలపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. కొండమల్లేపల్లి లో ఉన్న ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.