11-12-2025 01:34:24 AM
జుక్కల్, 10 డిసెంబర్ (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. 15 మంది ఉదయం స్కూలుకు ఆటోలో వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ప్రణవ్ (15) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని సావర్గాం గ్రామానికి చెందిన విద్యార్థులు ఖండేబల్లూర్ హైస్కూల్ కు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ప్రణవ్ అనే పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
మరో 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు గమనించి ప్రైవేటు ఆసుపత్రులకు వారి తల్లిదండ్రు లు తరలించినట్లు చెప్పారు. ఉదయం టైం అవుతుందని తొందరగా వెళ్లాలని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్త్స్ర నవీన్ చంద్ర తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి తోట కాంతారావు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
హుటాహుటిన విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా సంబంధిత అధికారులకు ఫోన్లో వైద్య సదుపాయం మెరుగ్గా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మండే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే సావర్గం గ్రామంలో ఒకేసారి 14 మంది విద్యార్థులకు గాయాలు కావడం ఒకరు మృతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
ఈ విషయం మండలం మొత్తం పాకడంతో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతోనే ఇలాంటి దుస్థితికి కారణమని చెబుతున్నారు. తమ కొడుకు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మృతుడి తల్లిదండ్రులు రోదనాతో గ్రామంలో పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.