21-08-2025 12:22:28 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, ఆగస్టు 20 : నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యాన్ని శుభ్రపరచేందుకుగాను జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు,పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం శుభ్రపరిచే ఆటోమేటిక్ యంత్రాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవిని ఆదేశించారు.
బుధవారం ఆమె నల్గొండ జిల్లా, తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్ ధాన్యం శుభ్రపరిచే యంత్రం పనితీరును పరిశీలించారు.వానకాలం సీజన్లో దాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు, మార్కెట్ యార్డులకు పెద్ద మొత్తంలో ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సీజన్‌లో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు, పూర్తి నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసేందుకు ధాన్యం శుభ్రపరచే ఆటోమేటిక్ యంత్రాలు బాగా ఉపయోగపడుతున్నం దున జిల్లాలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులు, సౌకర్యాలు ఉన్న పెద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు.
తక్షణమే ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పారసరఫరాల అధికారి వెంకటేశం, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, తహసిల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో సుధాకర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.