calender_icon.png 27 July, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త శిఖరాలకు విమానయాన రంగం

19-07-2025 12:00:00 AM

చలాది పూర్ణచంద్రరావు :

భారత విమానయానరంగం కొత్త శిఖరాలకు చేరుకున్నది. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలోనే భారత్ తృతీయ స్థానంలో నిలిచింది. రాబోయే ఐదేండ్లలో భారతదేశ విమానయాన రంగం 4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఆ లక్ష్యానికి అనుగుణంగా మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్ హాల్ (ఎంఅర్‌వో) కేంద్రాలను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నది.

తద్వారా భారత విమానయాన సంస్థను ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్‌కు గ్లోబల్ హబ్ చేయాలని కేంద్రం భావిస్తున్నది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే నాటికి భారత్‌లో కేవలం 96 ఎంఅర్‌వోలు ఉండగా, ప్రస్తుతం దేవంలో వాటి సంఖ్య 169కి చేరుకున్నది. 2030 నాటికి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య సుమారు 50 కోట్లకు చేరుకోనుందని ఓ అంచనా. ప్రపంచంలోని ఎన్నోదేశాల జనాభా కంటే, ఈ ప్రయాణికుల సంఖ్య ఎక్కువని వేరే చెప్పనక్కర్లేదు.

దీనికి తోడు ఈ రోజుల్లో పెద్ద మొత్తంలో సరుకు రవాణా విమానాల ద్వారానే జరుగుతున్నది. యేటా విమానాల్లో 35 లక్షల మెట్రిక్ టన్నుల వస్తువుల రవాణా జరుగడమే అందుకు నిదర్శనం. ఈ దశాబ్దం చివరి నాటికి, ఈమొత్తం కోటి మెట్రిక్ టన్నుల వరకు యేటా సరుకుల రవాణా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక  భారత విమానయాన రంగం అత్యంత వేగంగా అభివృద్ధిని సాధిస్తూ, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఎదిగింది. గతంలో ఎప్పుడూ ఎరుగని రీతిలో ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో పాటు విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ రవాణా, ప్రైవేటు రంగ పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నది.

దేశ పౌరవిమానయాన వాణిజ్యంలో రానున్న సంవత్సరాల్లో అపారమైన అవకాశాలున్నాయని గతేడాది జూన్ 2వ తేదీన న్యూ ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన 81వ వార్షిక అంతర్జాతీయ విమాన రవాణ సంస్థ సమావేశం (ఐఏటీఏ), వరల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్ సర్వసభ్య సమావేశం (డబ్ల్యూఏటీఎస్)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. అంటే.. స్వదేశీ విమానయాన రంగానికి ఉన్న మార్కెట్‌ను ప్రపంచ దేశాలకు వివరించి..

తద్వారా వివిధ దేశాల పెట్టుబడులు రాబట్టేందుకు చేసిన ప్రయత్నం ఇది అని మోదీ చెప్పకనే చెప్పారు. సమావేశంలో అంతర్జాతీయ స్థాయి విమానయాన పరిశ్రమ రంగ నిర్వాహకులు, నిపుణులతో పాటు ఈ రంగానికి చెందిన ఇతర ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం మన దేశంలో చివరిసారిగా 42 ఏండ్ల కిందట 1983లో జరిగింది. ఆ తర్వాత మరలా గతేడాది జరిగిన సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. 

సామాన్యుల పాలిట వరం ‘ఉడాన్’

విమానాన్ని గాల్లోనే చూసి.. అసలు మనం విమానం ఎక్కుతామా? అనే సామాన్యుల విమాన ప్రయాణ కలను మోదీ ప్రభుత్వం ‘ఉడే దేశ్ కా ఆం నాగరిక్’ (ఉడాన్) పథకం ద్వారా తీర్చింది. 2016 అక్టోబర్ 21న ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 1.5 కోట్లకు పైగా ప్రయాణికులు తక్కువ ధరలకే విమానాలు ఎక్కి విమాన ప్రయాణంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా తమ కలను సాకారం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఈ పథకాన్ని ఉపయోగించుకుని కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాకుండా పట్టణ ప్రాంతాలకు చెందిన సామాన్యులు కూడా విమానప్రయాణాలు చేస్తున్నారు. విమాన ప్రయాణం చేయడంతో వారి ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘ఉడాన్’ పథకం వల్లే సాధ్యం అయింది. దేశ విమానయాన పరిశ్రమ ఏటా రెండంకెల వృద్ధి నమోదు చేస్తుండటానికి ఈ ‘ఉడాన్’ పథకం కూడా ఒక కారణం అని తప్పకుండా ఒప్పుకోవాలి.

పైగా వివిధ చిన్న నగరాలను కూడా విమానయాన రంగం పరిధిలోకి తేవడంలో కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’ పథకం ప్రధాన పాత్ర పోషించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో కొత్త  విమానాశ్రయాలు, రాకపోకలు సాగించిన  విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఈ వృద్ధి మరింత వేగవంతమవుతుందని అంచనా. పెరుగుతున్న ప్రయాణికుల అవసరం తీర్చేందుకు వివిధ దేశీయ విమానయాన సంస్థలు మరో 2 వేల కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయి.

విమానయాన భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనాటి సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు  ఐసీఏవో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లో నిబంధనలను రూపొందించింది. ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదాన్ని విమానయానంలో అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాల దిశగా భారత నిబద్ధతకు మరో నిదర్శంగా పేర్కొనవచ్చు.

అందరికీ అందుబాటులో తక్కువ వ్యయంతో, భద్రతతో కూడిన విమానయాన భవిష్యత్ నిర్మించాలని ఆ రంగంలో భాగస్వాములను ప్రధానమంత్రి సరేంద్ర మోదీ కోరారు. విమానాల నిర్వహణలో అంతర్జాతీయ కేంద్రంగా నిర్వహణ, మరమ్మతులు, సమగ్ర పరిశీలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి ఆ సమావేశంలో దృఢ చిత్తంతో చెప్పారు.

ఈ మాటలు విమాన యాన రంగంలో భారత్ తీసుకుంటున్న జాగ్రత్తలకు నిదర్శనం. విమాన నిర్వహణలో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. యేటికేడు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నది. అందుకు అనుగుణంగానే అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభపరిణామం.  

కొత్తగా 120 విమానాశ్రయాలు.. 

ప్రస్తుతం దేశంలో మొత్తం 487 ఎయిర్‌పోర్టులున్నాయి. వీటిలో ఎయిర్ స్ట్రిప్స్‌తో పాటు ఇతర ల్యాండింగ్ సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు మాత్రమే కాకుండా మిలిటరీ బేస్‌లు, ఫ్లయింగ్ స్కూల్స్ కూడా దేశంలో కొనసాగుతున్నాయి. వాటిలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలోనే 137 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. రానున్న పదేండ్లలో మరో 120 విమానాశ్రాయాల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నది.

తద్వారా భారత విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో 15 శాతానికి పైగా విమానాలు మహిళా పైలట్లు నడిపిస్తున్నారు. ఈ సంఖ్య అంతర్జాతీయ సగటు కన్నా, మూడు రెట్లు ఎక్కువ. క్యాబిన్ సిబ్బందిలో ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు 70 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 86 శాతంగా ఉంది.

భారత్ ఎంఆర్‌వో సెక్టార్‌లోనూ ప్రపంచ సరాసరి కంటే, భారత్‌లో మహిళా ఇంజినీర్ల సంఖ్య అంతర్జాతీయ సగటును మించిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన రంగం మహిళలు పనిచేసేందుకు అనువైన విభాగమని దీన్నిబట్టి తెలుస్తున్నది. మహిళలు ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని, ఈ రంగంలో దూసుకుపోతున్నారు.

కేవలం వారు అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా భారత విమానయాన రంగాన్ని కూడా కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. విమానయాన సేవల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే త్వరలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మన విమానయాన రంగానికి కొత్త ఊపిరులు పోస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉడాన్’ పథకం దేశీయ విమానయాన రూపురేఖలనే మార్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకుని.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ విమానయాన రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

వ్యాసకర్త సెల్: 94915 45699