15-08-2025 10:29:09 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కష్టే ఫలి అన్నట్లుగా, నిర్విరామంగా శ్రమించిన వారికి విజయం తప్పక దక్కుతుందనడానికి మరిపెడ మండలం ఆనేపురంకు చెందిన హుస్సేన్ నిదర్శనంగా నిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన సేవలను అంకితం చేసిన హుస్సేన్ కు పంద్రాగస్టు సందర్భంగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
ఆనేపురంలో 1971 నుండి గ్రామ సేవకుడిగా పనిచేసిన తుల్ల రంగయ్య చిన్న కొడుకు హుస్సేన్ కు తండ్రి మరణానంతరం వారసత్వంగా గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)గా ఉద్యోగం లభించగా, వీఆర్ఏ విధులను మరిపెడ మండలంలో నిస్వార్థంగా నిర్వర్తించారు. ఆయన అంకితభావం, అకుంఠిత దీక్షను గుర్తించిన ఉన్నతాధికారులు, ఆయనను కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించారు. శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఆయన సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం లభించింది.