calender_icon.png 20 November, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవార్డులు బాధ్యతలు పెంచుతాయి

20-11-2025 05:56:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఏ అధికారికైనా అవార్డులు రావడం బాధ్యతలు మరింత పెంచుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ నెల 18వ తేదీన జరిగిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక “జల సంచయ్ – జన భాగీదారి” అవార్డును స్వీకరించి గురువారం కలెక్టరేట్ కు వచ్చిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు కార్యాలయం ప్రధాన గేటు వద్ద అధికారులు పూలమాలలు, బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. పలువురు అధికారులు కలెక్టర్‌కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయి జల అవార్డుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. జిల్లాకు కోటి రూపాయల రివార్డు లభించడం విశేషమని తెలిపారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పని చేసి, జిల్లాకు మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాకు ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిసి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.