09-01-2026 12:17:17 AM
గుండాల, జనవరి 8 (విజయక్రాంతి): రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం స్థానిక సీఐ లోడిగ రవీందర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ రవీందర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు నిర్లక్ష్యం, అజాగ్రత్త, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలేనని అన్నారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతీ ఒక్కరూ తమ ప్రాణ భద్రతతోపాటు తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.
ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్రాగి వాహనాలు నడుపొద్దని, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, రోడ్డుపై ప్రయాణించే సమయంలో మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుందని అన్నారు. విద్యార్థులు, యువత రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకొని తమ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కూడా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించాలని ఆయన కోరారు.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి భాద్యతని, పోలీసుల చర్యలతోపాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. అనంతరం సీఐ తన సిబ్బంది మరియు వాహనదారులతో కలిసి రోడ్డు భద్రతపై సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు.