23-12-2025 02:10:27 AM
మొయినాబాద్, డిసెంబర్ 22 విజయ క్రాంతి: చేవెళ్ల షీ టీమ్స్ బృందం ఆధ్వర్యంలో TGSWRS స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, చేవెళ్ల బ్రాంచ్ (తోల్కట్ట) లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ పాత్ర, పోక్సో చట్టం, నిర్భయ చట్టం, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల షీ టీమ్ ఇన్చార్జి శ్యామ్ సుందర్ ఎస్‌ఐ మాట్లాడుతూ, అమ్మాయిలు తమ వ్యక్తిగత వివరాలను ఎక్కడా షేర్ చేయకూడదని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112కి, సైబర్ నేరాల కోసం 1930కి, బాల్య వివాహాలు లేదా చిన్నపిల్లలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే చైల్ హెల్ప్లైన్ 1098కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈవ్-టీజింగ్ ఘటనలపై చేవెళ్ల డివిజన్ షీ టీమ్ నంబర్ 8712663673కి, సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 8712663061కి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా వినియోగం, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై అమ్మాయిలు ఒంటరి ఫొటోలు లేదా ఇతర ఫొటోలు అప్లోడ్ చేయకూడదని, ఎవరితోనూ షేర్ చేయకూడదని హెచ్చరించారు. చిన్నపిల్లలకు ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’పై షీ టీమ్ బృందం అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల షీ టీమ్ ఇన్చార్జి శ్యామ్ సుందర్ ఎస్‌ఐతో పాటు సిబ్బంది జ్యోతి, రేష్మా, వైద్యనాథ్ పాల్గొన్నారు. అలాగే TGSWRS స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ అనిత, ఇతర ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, తదితరులు హాజరయ్యారు.