calender_icon.png 10 January, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

09-01-2026 10:02:25 PM

- మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేష్ కుమార్

నస్పూర్,(విజయక్రాంతి): మహిళా చట్టాలపై అందరికి అవగాహన కలిగి ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేష్ కుమార్ అన్నారు. శుక్ర వారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని మార్టిన్ గ్రామర్ హైస్కూల్‌లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, T-Safe యాప్, షీ టీమ్ సేవల గురించి విద్యార్థులకు వివరించారు. 

పోక్సో చట్టం ద్వారా 18 సంవత్సరాల లోపు పిల్లలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించబడుతుందని, పిల్లలపై నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని సీఐ తెలిపారు. ఈవ్ టీజింగ్‌కు గురైనప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు సంబంధించి హెల్ప్‌లైన్ (1930)కు ఫిర్యాదు చేయాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. 

మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ ఉషారాణి గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, అపరిచితుల అనుచిత ప్రవర్తనను వెంటనే తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం T-Safe యాప్ వినియోగంపై వివరించారు. షీ టీమ్ సేవల కోసం డయల్ 100తో పాటు రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385లను గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సభిహా సుల్తానా, షీ టీమ్ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ శ్రీలత, కానిస్టేబుల్ సతీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.