09-01-2026 10:07:24 PM
ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇదివరకటితో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్పూర్తితో ప్రస్తుత విద్యా సంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సావిత్రీ బాయి పూలే 195 జయంతి వేడుకలకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన మహిళా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే విషయంలో ప్రభుత్వం ఎంతమాత్రం రాజీ పడబోదని స్పష్టం చేశారు. సుమారు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మేరుగుపర్చేలా సాంకేతిక విద్యను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని తెలిపారు.
చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. పాఠశాల దశలోనే బలమైన పునాది పడితే, విద్యార్థులు ఉన్నత విద్యను ఆసక్తితో అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగానే సర్కారీ బడులలో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు.
చక్కగా పనిచేసే వారిని తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరు తమ విధులకు పూర్తి న్యాయం చేస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు సైతం ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టులలో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. వార్షిక పరీక్షలు సమీపించిన దృష్ట్యా, రానున్న రెండు నెలలు గట్టిగా కృషి చేస్తూ పదవ తరగతి ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలుపాలని అన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్ధి దశలో పదవ తరగతి ఎంతో కీలకమైనదని, వారికి ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తూ సరైన దిశానిర్దేశం చేస్తే చక్కటి మార్గంలో పయనిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని, లేనిపక్షంలో పెడద్రోవ పట్టే ప్రమాదం ఉందని అన్నారు. తల్లిదండ్రుల కంటే బడులలో ఉపాధ్యాయుల వద్దే విద్యార్థులు ఎక్కువ సమయం గడుపుతారని గుర్తు చేశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, చదువు పట్ల ఆసక్తి, ఏకాగ్రత చూపేలా గురువులు మార్గనిర్దేశం చేయాలని హితవు పలికారు.
చదువులో ఒకింత వెనుకబడిన పిల్లలను చిన్నచూపు చూడకుండా, అలాంటి వారి పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ మరింతగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. మండల విద్యా శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి బడిలో నాణ్యమైన విద్యా బోధన జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పాఠశాలల్లో మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని అన్నారు. ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వసతుల కొరత ఉంటే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ఎస్సెస్సీలో మెరుగైన ఫలితాల సాధన, అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలన్నారు. విద్యార్థులు ప్రయోజనం కోసమే ముఖ గుర్తింపు (ఎఫ్.ఆర్.ఎస్)తో కూడిన హాజరు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందినా 285 మంది విద్యార్థిని, విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐ.టీలో ప్రవేశాలు పొందడం ఎంతో గొప్ప విషయం అని, ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అద్వితీయ ఫలితాలు సాధించి, మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.