06-01-2026 09:11:08 PM
హనుమకొండ,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ పోలీసు అధికారుల సమన్వయంతో పోచంమైదాన్ కూడలిలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్, సెంట్రల్ జోన్ డిసిపి.ధార కవిత, ఏఎస్పి శుభం, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, వరంగల్ భారత్ అసియేషన్ ప్రెసిడెంట్ వలస సుధీర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, మట్వాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టీ.జయపాల్ రెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మాట్లాడుతూ... "రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్న విషాద కథలుగా మారుతున్నాయని తెలిపారు. ఒక్క క్షణపు నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని తీస్తుంది కావున వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు నియమాలు మీ ప్రాణాలను, మీ కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు రూపొందించబడ్డాయి. ట్రాఫిక్ నియమాలు పాటించడం మనందరి బాధ్యతగా తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మనందరి సామూహిక బాధ్యతగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిపి ధార.కవిత మాట్లాడుతూ "అతివేగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం చిన్న తప్పులు కావు, ప్రాణాంతక తప్పులుగా సూచించారు. రోడ్డు నియమాలు తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. అనంతరం సుమారు 200 మంది విద్యార్థులచే ప్లకార్డులతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.కూడలి వద్ద న్యాయమూర్తులు, పోలీసు అధికారులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.