calender_icon.png 30 August, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి

30-08-2025 02:11:51 AM

-వివిధ రంగాల నిపుణులు

-హైడ్రా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణ

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే నగరంలో వరద ముప్పును, వేసవి నీటి ఎద్దడిని సమర్థంగా ఎదుర్కోగలమని వివిధ రంగాల నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం 2 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంకుడు గుంతలే నగర ‘జల’ భవిష్యత్తుకు ఏకైక మార్గమని స్పష్టం చేశారు. “ఇంకుడుగుంతలతో వరద నివారణ, భూగర్భ జలాల పెంపు” అనే అంశంపై శుక్రవారం హైడ్రా కార్యాలయంలో జరిగిన సదస్సులో  వివిధ రంగాల వారు పాల్గొన్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఆవశ్యకతను ప్రజలకు వివరించగలిగితే, వాటి అమలు సులభమవుతుంద న్నారు.

గతంలో హైడ్రా చర్యలతో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లపై నగరవాసులకు పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పుడు చెరువుల వద్ద ప్లాట్లు కొనాలంటే ఆ విషయా లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదే తరహాలో ఇంకుడు గుంతలపైనా అవగాహన కల్పించాలి” అని ఆయన సూచించా రు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. తొలుత గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద కార్యాలయాలు, నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు చూపిస్తే ఆదరణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంక్రీట్ జంగిల్‌గా నగరంనగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గమే లేకుండా పోతోందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.  వాల్టా చట్టం, ఇంకుడు గుంత లేనిదే నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకూడదనే నిబంధనలున్నా, అవి సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. 2024తో పోలిస్తే ఈ వేసవిలో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ 30 శాతం పెరిగిందని జలమండలి గ్రౌండ్ వాటర్ విభాగం సంచాలకులు సత్యనారాయణ తెలిపారు.  కార్యక్ర మంలో హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్, అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు పాల్గొన్నారు.