30-08-2025 02:13:30 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): గడిచిన 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆరు జిల్లాల్లో తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించింది. క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి 31 ప్రధాన సహాయక చర్యల ద్వారా మొత్తం 1,646 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ క్రమంలో తమ శాఖపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ, వాస్తవ పరిస్థితులను డైరెక్టర్ జనరల్ డీజీ నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు.
కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతివృష్టి కారణంగా తీవ్ర వరదలు సంభవించాయన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించి రైతులు, గొర్రెల కాపరులు, విద్యార్థులు, గర్భిణులు, వృద్ధులు, పశువులతో సహా మొత్తం 1,646 మందిని కాపాడినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా, కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి వరకు కూడా తమ సిబ్బంది చీకటిని, ఉధృతమైన ప్రవాహాన్ని లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టారని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తమ సిబ్బందిని చూసి గర్వపడుతున్నానని అన్నారు. కాగా కొంతమంది వ్యక్తులు తమ శాఖ కృషిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“కామారెడ్డిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించేందుకు మా సిబ్బంది బుధవారం రాత్రి 11:30 గంటలకు వెళ్లగా, తాను బయటకు రానని ఆయన నిరాకరించారు. కానీ, అదే సమయంలో ఆయన ముగ్గురు పొరుగువారిని మా సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అనవసరంగా ఉన్నతాధికారులకు ఫోన్ కాల్స్ చేస్తూ అత్యవసర సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగించాడు” అని డీజీ స్పష్టం చేశారు.
ప్రమాద స్థాయి, తక్షణ అవసరాన్ని బట్టే సహాయక చర్యలకు ప్రాధాన్యత ఇస్తామని, ఆ కాలనీల్లో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకపోవడమే తమ పనితీరుకు నిదర్శనమని అన్నారు. కామారెడ్డిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వాహనంతో పాటు వరదలో కొట్టుకుపోయినా, తమ శిక్షణ నైపుణ్యంతో క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు.
తాను స్వయంగా జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ వంటి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి చర్యలను పర్యవేక్షించినట్లు తెలిపారు.ప్రజలు సహకరించాలివిపత్తుల సమయంలో ప్రజలు సహాయక బృందాలకు సహకరించాలని, సిబ్బంది సూచనలను పాటించాలని డీజీ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.