30-08-2025 02:11:05 AM
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతిన్న నేపథ్యంలో ఈఎన్సీ అశోక్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల వివరాలపై ఆరా తీశారు. రాష్ర్టవ్యాప్తంగా 1,291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు మంత్రికి అధికారులు నివేదించారు.
వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మత్తుల కోసం రూ. 352 కోట్లు, మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం రూ.374.71 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా.. వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్టు, మిగిలిన గ్రామాలకు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు ఈఎన్సీ అశోక్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
పీఆర్ ఈఎన్సీ కార్యాలయంలో కాల్ సెంటర్
అధిక వర్షాల పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. రాజధానిలోని ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు, ఎలాంటి రహదారి సమస్యలు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తినా, ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడ్డా వెంటనే 040--35174352 నెంబర్‌కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.