26-07-2025 05:52:35 PM
కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించే పీఎంఈజీపి (Prime Minister's Employment Generation Programme) పథకం గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి పీఎంఈజీపి, పీఎం విశ్వకర్మ పథకాల గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపించే పీఎంఈజీపి పథకం గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తద్వారా నిరుద్యోగ యువత పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి మార్గాలు సృష్టించుకోవడానికి సులభతరం అవుతుందని చెప్పారు. పీఎంఈజీపి పథకానికి సంబంధించిన ప్రయోజనాలను తెలియజేసే విధంగా పోస్టర్లను రూపొందించి అన్ని బ్యాంకుల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పథకాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా పరిశ్రమల శాఖ, తెలంగాణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి(కేవీఐబీ)పై ఉందని కాబట్టి వారు ఆ దిశగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ఏడాది పీఎంఈజీపీ కింద 500 దరఖాస్తులు లక్ష్యంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న 62 దరఖాస్తులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవి ఏఏ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. సమావేశానికి కెవిఐసి ప్రతినిధి హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఎంఈజీపీ రుణాలను యువత వినియోగించుకోవాలి
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, స్థిర ఆదాయం వచ్చే నూతన యూనిట్లను స్థాపించి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని అన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రాధాన్య రంగాలకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. యువత ఎవరైనా సేవా, పరిశ్రమిక రంగంలో రాణించేందుకు ఆసక్తి ఉంటే పీఎంఈజీపీ పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పీఎంఈజీపీ కార్యక్రమం కింద అర్హులైన వారు వివిధ రకాల వ్యాపార యూనిట్లు పెట్టేవారికి గ్రామీణ 35శాతం వరకు సబ్సిడీ అందుతుందని చెప్పారు. సమావేశంలో డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జ్యోతి, ఎల్ డి ఎం శివకుమార్, కెవిఐబి ప్రతినిధి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.