calender_icon.png 27 July, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలి

26-07-2025 08:18:20 PM

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): గుండె సంబంధిత అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడడానికి చేసే సిపిఆర్ పట్ల ప్రతీ ఒక్కరు అవగాహనపెంచుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు.సిపిర్ పట్ల అవగాహన కల్పించడానికి రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శనివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఆయనతో పాటుగా సిపిర్ పై శిక్షణ ఇవ్వడానికి డా. సతీష్, డా. బలరాం హాజరుకాగా, నిర్వాహకులు,రోటరీ -ఆపి -రెడ్ క్రాస్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ , టీవీ సూర్యం, ఏవిఎల్ఎన్ చారి, ఎన్.రాజు, బొడ్ల జగదీశ్, భూమేశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్  జి.లిల్లి మేరీ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సి పి ఆర్ అనేది ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఉపయోగించే కీలకమైన ప్రథమ చికిత్స అని వివరించారు. ఇది వైద్య సహాయం వచ్చే వరకు మెదడు, ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి  ఎంతగానో సహాయపడుతుందన్నారు.

నిమిషానికి 100–120 బీట్‌ల వద్ద ఛాతీ కుదింపులతో కూడినదనీ,అత్యవసరంగా ప్రాథమిక స్థాయిలో చేతులు మాత్రమే ఉపయోగించే సి పి ఆర్ బాధితుడు బ్రతకడానికి గల అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు. ప్రాణాలను కాపాడే సిపిర్ జ్ఞానంతో ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ, శిక్షణ పొందడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ -ఆపి-ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి అభినందనలు చెపుతూ, నర్సింగ్ విద్యార్థినిలు సిపిర్ పట్ల పూర్తి అవగాహన పెంచుకుని శిక్షణ పొందాలని సూచించారు.