26-07-2025 08:19:09 PM
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ..
కరీంనగర్ (విజయక్రాంతి): ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈమధ్య భ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయన మెంటల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ డిసిసి అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని, ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోన్ టాపింగ్ పాల్పడింది, దానిని తెలంగాణకు పరిచయం చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, మంత్రులను, రాజకీయ నాయకులను, సినీ నటుల ఫోన్లను, కాంట్రాక్టర్ల ఫోన్లను, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ఎవరిని వదలకుండా ట్యాప్ చేశారని అన్నారు.
టెర్రరిస్టుల నెపంతో ఫోన్ టాపింగ్ కు పాల్పడి, ప్రభుత్వానికి, కోర్టులకు దొరకకుండా జాగ్రత్తపడి ఆధారాలను, రికార్డులను ధ్వంసం చేశారని తెలిపారు. ఏదో విధంగా వార్తల్లో నిలవాలని దురుద్దేశంతో కౌశిక్ రెడ్డి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డికి మతి భ్రమిస్తే మెంటల్ ఆసుపత్రి వెళ్లి వైద్యులను సంప్రదించాలి, పిచ్చి ముదిరితే ప్రజలే నిన్ను తరిమి కొడతారని అన్నారు. రేవంత్ రెడ్డి జీవితంలో ఎంతో కష్టపడి సామాన్య కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప నేత అని అన్నారు. కెసిఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు పొందడానికి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, నాయకులపై ఆరోపణలు చేస్తున్నాడని, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పిచ్చి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి గారు పిచ్చి కుక్క కరిచినట్లుగా మాట్లాడుతున్నాడు, ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక వీధి రౌడీలాగా, కళ్ళు కాంపౌండ్లో మాట్లాడుకునే చిల్లర వెధవలాగా మాట్లాడుతున్నాడని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తక్షణమే శాసనసభ స్పీకర్ జోక్యం చేసుకొని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. స్పీకర్ స్పందించకుంటే అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడమని తెలిపారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.జరగబోయే పరిణామాలకు బిఆర్ఎస్ నాయకత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.