25-11-2025 12:00:00 AM
అభినందనలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్ట, నవంబర్ 24 (విజయ క్రాంతి): ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నివాసంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణతో పడి పూజ కార్యక్రమం ఆద్యంతం ప్రతి ఒక్కరిని భక్తి పారవశ్యంలో మునిగేలా చేసింది.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకు ముందు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తో,పలువురు నాయకులతో కల్సి దర్శించుకున్నారు. మంత్రికి వేద పండితులు ఆశీర్వాదం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ... ‘నాకు అయ్యప్ప స్వామి అంటే అత్యంత ఇష్టం.
ఇంత మంది అయ్యప్ప భక్తులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నది. మంచి ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అయ్యప్ప దీక్ష మనిషిలో గొప్ప పరివర్తన తీసుకు వస్తుంది.ఈర్ష్యా, ద్వేషాలు,దురలవాట్లు తగ్గి సమాజం పట్ల కరుణ గుణం కలుగుతుంది.భగవంతుడు కూడా చెప్పేది సాటి మనిషిని ప్రేమించమనే కదా.41రోజుల మండల కఠిన దీక్షలో సాక్షాత్తు అయ్యప్పను మీలో చూస్తాం.
చన్నీటి స్నానం,ఒక్క పూట భోజనం,కటిక నేల మీద నిద్ర అయ్యప్ప దీక్షలో కఠిన నియమాలు. వాటిని పాటిస్తూ మండల కాలంలో గొప్ప మార్పు దీక్ష పరుల్లో కల్గుతుంది. అయ్యప్ప స్వామి దయతో రైతులు పాడి, పంటలతో,ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్న.
ఇంత మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పడి పూజ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కి అభినందనలు.‘ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మార్కెట్ కమిటీ చైర్మన్ డిసిసి ప్రెసిడెంట్లు మరియు పలువురు నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది.