25-11-2025 12:00:00 AM
పెద్దపల్లి, నవంబర్ -24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధా న్యం ఇస్తుందని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం పెద్దపల్లి పట్టణం లోని ఓ గార్డెన్స్‌లో ఇందిరా మహిళా శక్తి చీరలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌లతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు ఓర్వలేక వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
గత 10 సంవత్సరాల పాలనలో వడ్డీలేని రుణాలు అందించాలని ఆలోచన బీఆర్‌ఎస్‌కు రాలేదని, తమ ప్రభుత్వం రూ.5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద రూ.9 కోట్లు విడుదల చేశామని, ప్రస్తుత సంవత్సరం మరో రూ.10 కోట్ల విడుదల చేయబోతున్నామని చెప్పారు.
2047 తెలంగాణ రైసింగ్ పాలసీ లో భాగంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ కోటీశ్వరులను చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోనే మహిళలకు సారే అందించాలని లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఆర్డిఓ గంగయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, తహసీల్దార్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.