30-10-2025 01:21:01 AM
చంద్రన్న, బండి ప్రకాష్ లొంగుబాటు షాక్...
మావోయిస్టు పార్టీ, సికాసకు తీరని నష్టం...
విప్లవ కారిడార్ సింగరేణి కకావికలం
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 29: వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్ల పర్వంతో మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సికాసకు తీరని నష్టం జరిగింది. ఎన్ని ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లు జరిగినా మేల్కొంటూ వస్తోన్న సికాస కు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు (చంద్రన్న), రాష్ట్ర కమిటీ సభ్యుడు, సికా స ఇంఛార్జి బండి ప్రకాష్ (క్రాంతి) లొంగుబాటు కోలుకోలేకుండా చేసింది.
చివరగా పెద్ద దిక్కుగా మిగిలిన ఈ ఇద్దరు అగ్ర నేతల లొంగుబాటు సింగరేణి కాలరీస్ లో మావోయిస్టు పార్టీ, సికాస ఉనికిని దెబ్బతీసింది. సికాస రక్త చరిత్ర అత్యంత విషాద భరితమైంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, మొదలుకొని, భూపాలపల్లి, మణుగూరు, సత్తుపల్లి, పెద్దపల్లి, మం చిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధి వరకు సింగరేణి కాలరీస్ విస్తరించింది.
సికాస విప్లవ కారిడార్లుగా కొత్తగూడెం, ఎల్లందు, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లం పల్లి, గోలేటి పారిశ్రామిక పట్టణాలు బలపడ్డాయి. వీటి పునాదులపై వెలసిన కార్మికోద్య మం లొంగుబాటుతో పెన్నిధిని కోల్పోయింది.
నెత్తుటి పోరాటాల్లో సికాస అవతరణ
బ్రిటిష్ కాలం నుంచి సింగరేణిలో కార్మిక పోరాటాల చరిత్ర మొదలైంది. తొలితరం కార్మిక ఉద్యమ నిర్మాత శేషగిరిరావు సింగరేణిలో ఉద్యమానికి విత్తనాలు చల్లారు. ఆయ న మరణంతో ఆగిన సింగరేణి పోరాటాలు బ్రిటిష్ పరిపాలన అంతమై సింగరేణిలో మలితరం కార్మిక ఉద్యమం పురుడుపోసుకుంది. అది సికాస రూపంలో అవతరించిం ది. 1981లో సింగరేణిలో 56 రోజుల సమ్మె నేపథ్యంలో సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) ఏర్పడింది.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖనిలో సికాస ఆవిర్భావం జరిగింది. అప్పటి వరకు సింగరేణిలో రాడికల్స్ విద్యార్థులు మాత్రమే కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అగ్రనేత నల్ల ఆదిరెడ్డి (శ్యామ్) సింగరేణి ప్రాంతంలో ప్రధానంగా బెల్లంపల్లిలో తిష్ట వేసి బొగ్గు గనుల్లో అగ్గి రాజేశాడు. సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక సంఘం ఉండాలని ఆకాంక్షించా రు.
విప్లవ కార్మికోద్యమ నాయకత్వం కోసం సికాసను నల్ల ఆదిరెడ్డి స్థాపించాడు. గజ్జల గంగారాం, కటకం సుదర్శన్, పెద్ది శంకర్, రాజేందర్, మహమ్మద్ హుస్సేన్, గురజాల రవీందర్ సికాస వ్యవస్థాపక ఉద్యమ నాయకులుగా చరిత్రకెక్కారు. ఇక అప్పటి నుంచి మొదలైన సికాస విప్లవోద్యమ ప్రస్థానం నాలుగు దశాబ్దాలకు పైగా అజరామంగా సాగుతూ వస్తోంది.
సికాస హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కులు, వేతనాల పెరుగుదల వంటి ఆర్థిక, రాజకీయ పోరాటాలు సాగాయి. గనుల్లో, కాలనీల్లో అధికారు ల, గుండాల దాష్టికాలకు వ్యతిరేకంగా సికాస నేతృత్వంలోనే అనేక పోరాటాలు జరిగాయి. చారిత్రకమైన విజయాలు, హక్కులు సాధించుకున్న ఘనత సింగరేణి కార్మికులకు ఉంది.
పోరుబాట వీడుతున్నారు...
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం ఫనంగా పెడుతున్న మావోయిస్టుల్లో కొందరిలో త్యాగనీరతి కొరవడుతుంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు, మావోయిస్టు పార్టీ గమనా న్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. ఏకంగా ఆయుధాలతో తమ అనుచర వర్గంతో ప్రభు త్వం ముందు లొంగిపోయారు.
వీరి ప్రభావంతో బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ, తన భర్త వివేక్ తో కలిసి నాలుగు దశాబ్దాల విప్లవోద్యమానికి చరమగీతం పాడారు. సోను, ఆశన్న మార్గాన్ని విభేదిస్తున్నట్లు చెబుతూనే తాజాగా మరో ఇద్దరు అగ్రనేతలు చంద్రన్న, బండి ప్రకాష్ సైతం లొంగుబాటు బాటపట్టారు.సాయుధ పోరాటమా..? శాంతియుత పోరాటమా..? అనే అంశంపై మావో యిస్టు పార్టీలో తలెత్తిన సైద్ధాంతిక విభేదంపై ప్రజల్లో, ప్రజాస్వామిక వాదుల్లో విభిన్నమైన చర్చ జరుగుతుంది.
ఈ సందిగ్ధ దశలో విప్లకారుల్లోనూ తీవ్ర గందరగోళం తలెత్తింది. ఫలితంగా సాయుధ పోరాట విరమణ వైపే కొందరు అడుగులు వేస్తున్నారు. మావోయిస్టుల్లో తలెత్తిన సంక్షోభాన్ని పోలీసు యంత్రాంగం, ప్రభుత్వాలు ఎంతో చాకచక్యంగా సద్వినియోగం చేసుకుంటున్నారన్న వాదనలున్నాయి. మరోవైపు మావోయిస్టులపై తమ విజయంగా పోలీసులు భావిస్తున్నారు.
నెత్తురోడిన సింగరేణి...
మావోయిస్టు పార్టీ నవ సమాజ నిర్మాణ లక్ష్యం సాధన కోసం పుట్టుకొచ్చిన రాడికల్స్ విద్యార్థులు, ఆ తర్వాత సింగరేణి కార్మికోద్యమానికి నిర్మాతలయ్యారు. ఎంతో మంది కార్మిక పిల్లలు అడవిబాట పట్టారు. పులి మదనయ్య, మోట శంకర్, కట్ల మల్లేష్, మేకల నరసయ్య, రమాకాంత్, గెల్లి రాజలింగు, వినోద్, షంషీర్ ఖాన్, రవీందర్ రెడ్డి, వీరయ్య, కనకరాజు, హనుమండ్ల సత్యం, బేద రామస్వామి, మంతెన వెంకటేశ్వర్లు, ముద్దు నారాయణ, విష్ణుబత్తుల వెంకటేశ్వర్లు,
జాడి పోషం, కొంపెల్లి శ్రీనివాస్, కాసిపేట కృష్ణమూర్తి, జిలానీ అక్క, గజ్జల సరోజ, వినోద్, రంజిత్, జనార్దన్, తిలక్, ఎల్తూరి రామచందర్, రామగుండం ఓదె లు, బొల్లం రాజనర్సు, రేణికుంట్ల రాజం, రామకృష్ణ, తోట రాములు, జంజిపల్లి శ్రీధర్, ఇప్ప హనుమంతు, కృష్ణ, సిరికొండ రమేష్, అన్నపూర్ణ, తిప్పారపు సమ్మయ్య, నల్లుల కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, మంగన్న, మొగిలి, కుష్ణపల్లి ఎల్లయ్య,
రాజ్ కుమార్, పులిపాక రామకృష్ణ, పాల్గుణ, కలువల సారయ్య, శనిగారం రాంచందర్, పులిపాక లక్ష్మణ్, కాసరవేణి రవి, సాంబీరెడ్డి, జాడి వెంకటితోసహ ఎంతో మంది కార్మిక, కర్షక బిడ్డలు రక్తతర్పణం చేశారు. ఇందులో కొందరు ఉద్యమాన్నివీడారు. మరికొందరు కొనసాగుతున్నారు.