calender_icon.png 30 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి

30-10-2025 01:44:32 AM

బీజేపీ ఎంపీ డీకే అరుణ 

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్‌కు ఓడిపోతున్నామనే భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్ మైనారిటీ వర్గాలకు మంత్రి పదవి అంటూ అంశాన్ని తెరమీదకు తెచ్చారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి బీజేపీపై అనేక కుట్రలు పన్నుతున్నాయని, అజారుద్దీన్‌కు మంత్రి పదవి అంటూ వార్తలు వస్తున్నాయని ఆమె అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓట్ల కోసం ముస్లిలంకు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు.

ఈ తాయిలాల్లో భాగమే అజారుద్దీన్‌కు మంత్రి పదవని చెప్పారు. ఉన్నఫళంగా మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చిందా..? అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

ఏం ఉద్ధరించారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్  నేతలు ఓట్లడుగుతున్నారని, దేవుళ్ళ మీద ప్రమాణం చేసి గ్యారెంటీలు ఇచ్చి, ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి ఓటేస్తామని స్వయంగా చెబుతున్నారని, ప్రచారంలో తమతో కలిసి నడుస్తున్నారని తెలిపారు.జూబ్లీహిల్స్‌లో లక్ష పైన ముస్లింల ఓట్లున్నాయని, 3 లక్షలకు పైగా హిందువుల ఓట్లే ఉన్నాయన్నారు.

హిందువులంతా ఐక్యంగా బీజేపీకి ఓట్లేయాలని  అరుణ కోరారు. 10 లక్షల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందన్నారు. ఎంత దోచుకోవాలి, ఎంత దాచుకోవాలన్నదే తప్ప రాష్ర్ట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చిత్త శుద్ధి లేదని విమర్శించారు. మూడేళ్లే ప్రభుత్వం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని, ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌కు ఛాలెంజ్ చేస్తున్నానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అనడానికి ఉదాహరణ నవీన్ యాదవ్ మాట్లాడే మాటలే నిదర్శనంగా ఉన్నాయని ఆరోపించారు.