calender_icon.png 1 February, 2026 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు బీ ఫారాలు ఇవ్వాల్సిందే?

01-02-2026 12:10:45 AM

  1. ఎన్ని టికెట్లు ఇస్తారో స్పష్టంగా ప్రకటించాలి
  2. లేదంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం
  3. రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, జనవరి 31(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీలకు బీఫామ్ ఇవ్వకపోతే ఆ పార్టీలకు మూడినట్టేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆరట్స్ కాలేజీ వద్ద బీసీ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాంపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తుంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా ఎన్నికలకు సై అంటున్నాయని, పార్టీల పరంగా నైనా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ఏ పార్టీ కూడా ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు.జనరల్ స్థానాల్లో ఇప్పటికే నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్‌లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

జనరల్ స్థానాలంటే రెడ్డి, రావులవి మాత్రమే కావని జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని ఆయన తెలిపారు. బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో బీఫామ్‌లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయని అన్నారు. సర్వేల పేరుతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు స్పష్టమైన తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని, లేనిపక్షంలో బీసీ ద్రోహుల పార్టీ లుగా చరిత్రలో మిగిలిపోతారని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.ఈ సందర్భంగా బీసీ సామాజిక వేదిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వ ర్, చలమల్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ పరంధాములు, బీసీ విద్యార్ది సంఘాల నాయకులు డాక్టర్ వట్టికుటి రామారావుగౌడ్, డాకర్ సాంబశివగౌడ్, నిజ్జన రమేష్ ముదిరాజ్, జాజుల లింగంగౌడ్, స్వామిగౌడ్,నాగేశ్వరరావు, ఆర్ ఎల్.మూర్తి, సైదులు యాదవ్, దునుకు వేలాద్రి, డాక్టర్ జీవన్, విద్యార్ది నాయకులు తదితరులు పాల్గొన్నారు.