28-07-2025 12:49:22 AM
- ఇంటింటికి వెళ్లి కూటమి వైఫల్యాలను ఎండగడుతున్నాం
- వైఎస్‌ఆర్‌సీపీ పొన్నూర్ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
గుంటూరు, జూలై 27 (విజయక్రాంతి): సూపర్-సిక్స్ వాగ్దానాలను అమలు చేయడంలో టీడీపీ -జనసేన -బీజేపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ బాబు షూరిటీ చీటింగ్ గ్యారెంటీ అనే వాస్తవాన్ని ప్రతి ఇంటికి చేరుస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని పెదకాకాని గ్రామంలో ఏర్పాటు చేసిన ‘బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఎన్నికలపుడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇంటింటికి బాండ్లు, కరపత్రాలు పంచి పెట్టారని గుర్తు చేశారు. నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గురించి మాట్లాడితే ఏప్రిల్ ఫూల్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానమైన హామీల్లో ఒకటైన యువతకు ఉద్యోగాలపై చంద్రబాబు చెప్పిన హామీ ఏమైందన్నారు.
నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారని, 20 లక్షల ఉద్యోగులు వచ్చే వరకు రూ.3 వేల భృతి ఇస్తామని అలివికానీ హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నారని వాపోయారు. గతేడాది బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.7,200 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని, ఆ ప్రస్తావనే లేదన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా అది లేదన్నారు.
ఆడబిడ్డ నిధి ఎక్కడ అని ప్రశ్నించారు. 18 నుంచి -59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాది రూ.18 వేలు ప్రతి ఇంటికి ఇస్తామని చెప్పారన్నారు. ఓట్లు వేసిన వారిలో 2.07కోట్ల మహిళలు ఓట్లు ఉన్నారని, వారందరికి 18 ఏళ్లు నిండాయని తెలిపారు.
అరవై ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1.8 కోట్ల మంది ఉంటారని, వారందిరికీ ఏడాదికి రూ.18 వేల చొప్పన రూ.32,400 కోట్లను కేటాయించాలన్నారు. ఐతే గతేడాది సున్నా కేటాయింపులు, ఈ బడ్జెట్‌లో కూడా కేటాయింపులు శూన్యమన్నారు. ప్రతి మహిళకు రూ.36 వేలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. ఉచిత బస్సు హామీ చెప్పిన చంద్రబాబు గజినీలా మారి మ్యానిఫెస్టోలోని హామీలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు.