06-12-2024 09:22:57 AM
హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో కోర్టు బెయిల్ మంజూరైంది. ఇద్దరి పూచీకత్తులు, రూ. 5,000 జరిమానాతో అతని బెయిల్‌ను కోర్టు ఆమోదించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులకు ఆటంకం కలిగించారని సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు అతనితో పాటు అతని సహచరులు 20 మందిపై కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ను కౌశిక్‌రెడ్డి సందర్శించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తన ఫోన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే స్టేషన్‌లో ఏసీపీ కనిపించకపోవడంతో అనుచరులతో కలసి వీరంగం సృష్టించినట్లు సమాచారం. దీని ఆధారంగా సీఐ రాఘవేంద్ర కేసు నమోదు చేసి కౌశిక్‌రెడ్డిని గురువారం అరెస్టు చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో బెయిల్ మంజూరైంది. ఇలాంటి ఘటనలు పునావృతం కావొద్దని జడ్జి హైచ్చరించారు. అటు అక్రమ అరెస్టును పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఊపిరి ఉన్నంత వరకు హూజూరాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.