17-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, అక్టోబర్ 16 : గర్భిణీ స్త్రీలు, బాలింతలు, బాల బాలికలు ప్రతి రోజు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే సమతుల్య ఆరోగ్యం సాధ్యమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషక ఆహార మాసోత్సవాలు, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసల కార్యక్రమాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యలతో కలిసి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు.
అనంతరం 250 మంది గర్భిణి మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. 50 మంది చిన్నారులకు అన్నప్రాసన, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, బాలబాలికల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల పాత్ర ప్రశంసనీయమైనది అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో అంగన్వాడీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ మోతి, ఐసిడిఎస్ జిల్లా అధికారి లలిత కుమారి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, సిడిపిఓ జయరాం నాయక్, తదితరులుపాల్గొన్నారు.