calender_icon.png 9 August, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన ఉండాలి

08-08-2025 11:46:50 PM

మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్...

లక్షేట్టిపేట (విజయక్రాంతి): వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఏసీపీ ప్రకాశ్(ACP Prakash) అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ఆటో, టాటా ఏసీ, స్కూల్ బస్ డ్రైవర్ల కు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఏసీపీ ప్రకాశ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాశ్ మాట్లాడుతూ... బడి పిల్లలను తీసుకువెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బడి పిల్లలను సురక్షితంగా, బాధ్యతగా తీసుకువెళ్లాలన్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, పరిమితికి మించి ఆటోల్లో పిల్లలను తీసుకువెళ్లి ప్రమాదాలకు గురి కాకూడదన్నారు.

ప్రతీ ఒక్క వాహనదారుడికి తప్పనిసరిగా లైసెన్స్‌, ఇన్సూరెన్సు ఉండాలన్నారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్లకు ఏవైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్, అదనపు ఎస్సై రామయ్య, దండేపల్లి ఎస్సై తహసీయోద్దీన్, మండలంలోని డ్రైవర్లు పాల్గొన్నారు.