09-08-2025 12:17:58 AM
సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే.. ఏజెంట్లతోనే పనులు..
నల్లగొండ టౌన్, ఆగస్టు 08 : రవాణాశాఖ కార్యాలయాల్లో అంతా ఆన్లైన్ జరుగుతున్నా ఏజెంట్ల హవా కొనసాగుతోంది. ఆన్లైన్లో స్లాట్లు బుక్ చేసినా వాహ నాల రిజిస్ట్రేషన్ల నుంచి డ్రైవింగ్ లైసెన్సుల వరకు ఏజెంట్లే అన్ని పనులను చక్కబెడుతున్నారు. కార్యాలయాలకు దగ్గరగానే ఉంటూ పనులు పూర్తి చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీ, డ్రైవింగ్ లైసెన్సులు, రోడ్డు టాక్స్, కమర్షియల్ వాహనాల అనుమతి వరకు వారే ఉండి పనులు చేస్తున్నారు. ప్రతి పనికి ఇంతా అని వసూలు చేస్తున్నారు. ఆన్ లైన్లో ఫీజులు చెల్లించడంతోపాటు పనులు చేసినందుకు కమీషన్ రూపంలో రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అధికారుల పేర్లు చెప్పి ఏజెంట్లు పనులు పూర్తి చేస్తుండడం గమనార్హం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి జిల్లా పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి లలో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొత్త వాహనాలకు సంబంధించి అన్ని టాక్సుల చెల్లింపులను కొనసాగిస్తున్నారు. ప్రతి రవాణా శాఖ కార్యాలయం పరిధిలో వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీ ఓనర్ షిప్, డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడంతోపాటు రెన్యువల్, కమర్షియల్ వాహనాల అనుమతి ఇతర పనులను కొనసాగిస్తున్నారు. వాహనాల తనిఖీలను చేపట్టడంతోపాటు ఫిట్నెస్ను పరిశీలిస్తున్నారు. ప్రతి కార్యాలయం పరిధిలో నిత్యం పలు రకాల వాహనాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు.
సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే రవాణా శాఖ సేవలన్నీ ఆన్లైన్లోనే కొనసాగిస్తుంది. ఏజెంట్లు ప్రమేయం లేకుండా నేరుగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని నేరుగా కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కొత్త డ్రైవింగ్ లైసెన్సు నుంచి రెన్యువల్ వరకు ఆన్ లైన్లో సేవలు అందుబాటులో ఉంచింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి పాత వాహనాల ఓనర్ షిప్ వరకు ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. నేరుగా స్లాట్లు బుక్ చేసుకొని వెళ్లిన వారికి వారు సమర్పించే వివరాల ఆధారంగా రిజస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కొన్ని సార్లు సమర్పించకపోవడంతో రిజిస్ట్రేషన్లు కానీ డ్రైవింగ్ లైసెన్సులు కానీ త్వరగా రావడం లేదు. ఆన్ లైన్లో సేవలు అందుబాటులో ఉన్నా రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏజెంట్లతోనే పనులు..
జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఇప్పటికీ ఏజెంట్లు లేనిదే పనులు జరగడం లేదు. వారి ద్వారా దరఖాస్తులు చేసుకొని వెళ్లిన వారికి అదే రోజు పనులు పూర్తవుతున్నాయి. కార్యాలయాల్లో వారే చక్రం తిప్పుతూ పనులు పూర్తి చేస్తున్నారు. ప్రతీ పనికి ఇంతా అని వసూలు చేస్తున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో ఏజెంట్లు కార్యాలయం బయటనే ఉండి పనులు చక్క బెడుతున్నారు. ప్రతి దరఖాస్తుపైన ఆర్టీఏకు సంబంధించి ఏజెంట్ల ద్వారా వెళ్లే వారికి టిక్కులు పెడుతూ పంపిస్తున్నారు. ఆ ఇండికేషన్ ఆధారంగా కార్యాలయాల్లో వారు సమర్పించిన జాబితాను పరిశీలించి రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తున్నారు. కొత్త డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడంతో పాటు రెన్యువల్ కూడా చేస్తున్నారు.
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఇదే రీతిలో కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీజును వినియోగదారుడి ద్వారానే ఆన్ లైన్ లో చెల్లింపులు జరిగే విధంగా చూస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ తర్వాత రూ.2వేల నుంచి రూ.4వేల వరకు అదనంగా తీసుకుంటున్నారు. ద్విచక్రవాహ నాలు, భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, కార్లకు వేర్వేరుగా ఏజంట్లు వసూళ్లు చేస్తున్నారు. కొత్త వాహనాల నుంచి పాత వాహనాల ఓనర్ షిప్ వరకు ఇదే రీతిలో రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తున్నారు.డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడంలో కూడా అదనంగా రూ.1000నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఏజెంట్ల ద్వారానే ఎక్కువ పనులు అయ్యే విధంగా అధికారులు కూడా సహకరిస్తున్నారు. నేరుగా వచ్చే వారికంటే ఏజెంట్ల ద్వారానే పనులు త్వరితగతిన అవుతుండడంతో ఎక్కువ మంది వారి ద్వారానే పనులు చేయించుకుంటున్నారు.
ఏజెంట్లు కూడా ప్రతీరోజు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల లెక్కల ఆధారంగా కొంత డబ్బును అధికారులకు సంబంధించిన వారికి సమర్పించుకుంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు వారికి అందజే స్తున్నారు. ప్రతి ఆర్టీవో కార్యాలయం పరిధి లో జరిగే లావాదేవీలు రూ.లక్షల్లో ఉంటాయని గతంలో జరిగిన ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. పలు కార్యాలయాలపై ఏసీబీ నజర్ ఉండడంతో బయట ఉండి ఏజెంట్లు పని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఏజెంట్ల కోసం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆర్టీఏ కార్యాలయాలల్లో పారదర్శకంగా పనులు కొనసాగిస్తే వాహనదారులకు మేలు జరుగనుంది. ఉన్నతాధి కారులు నజర్ పెడితే కొంత మేర ఏజెంట్ల హవా తగ్గే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.